
చెర్వుగట్టు పంచాయతీ రికార్డుల పరిశీలన
నార్కట్‌పల్లి : నార్కట్‌పల్లి మండలం చెర్వుగట్టులో శ్రీపార్వతీ జడల రామలింగేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా పనులు చేయకున్నా చేసినట్లుగా.. రూ.33 లక్షలు స్వాహా చేసినట్లు వస్తున్న ఆరోపణలపై సాక్షి దినపత్రికలో ‘స్వామి పేర సొమ్ము స్వాహా’ శీర్షికన గురువారం కథనం ప్రచురితమైంది. ఈ మేరకు జిల్లా అధికారులు స్పందించారు. చెర్వుగట్టు గ్రామ పంచాయతీకి చెందిన రికార్డులను డీఎల్‌పీఓ వెంకటేశ్వర రావు గురువారం తనిఖీ చేశారు. జిల్లా గ్రంథాలయ మాజీ చైర్మన్ రేగట్టె మల్లిఖార్జున్‌రెడ్డి సమక్షంలో పంచాయతీరాజ్ డీఈ మహేష్, ఎంపీడీఓ, చెర్వుగట్టు గ్రామపంచాయతీ ప్రత్యేక అధికారి ఉమేష్, ఎంపీఓ సుధాకర్ సమక్షంలో రికార్డులను పూర్తిగా పరిశీలించారు. గతంలో చేసిన పనులపై పంచాయతీరాజ్ ఏఈ భరత్, బ్రహ్మోత్సవాల సమయంలో విధులు నిర్వహించిన కార్యదర్శి గీతాంజలిని వివిధ అంశాలపై విచారించారు. అనంతరం రికార్డులను స్వాధీనం చేసుకొని నల్లగొండ కార్యాలయానికి పంపించారు. ఫిర్యాదు చేసిన అంశాలన్నింటిపై రికార్డులను పరిశీలించి తుది నివేదికను కలెక్టర్‌కు అందజేయనున్నట్లు డీఎల్‌పీఓ తెలిపారు. వీరి వెంట ప్రస్తుత జీపీ కార్యదర్శి రవీందర్‌రెడ్డి ఉన్నారు.

చెర్వుగట్టు పంచాయతీ రికార్డుల పరిశీలన