
గణేష్ శోభాయాత్రకు పటిష్ట బందోబస్తు
నిమజ్జన ప్రాంతాల్లో ఏర్పాట్లు పూర్తి..
నల్లగొండ : గణేష్ నిమజ్జన శోభాయాత్ర ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు ఎస్పీ శరత్ చంద్రపవార్ తెలిపారు. శోభాయాత్ర సందర్భంగా చేస్తున్న ఏర్పాట్లను బుధవారం ఆయన వివరించారు. ఈ నెల 5 నుంచి నిర్వహించే శోభాయాత్రలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జిల్లా పోలీస్ యంత్రాంగం అన్ని శాఖల సమన్వయంతో అన్ని రకాల ముందస్తు భద్రతా ఏర్పాటు చర్యలు తీసుకుంటోందన్నారు. జిల్లాలోని అన్ని ప్రధాన రహదారులతో పాటు వివిధ కాలనీల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి, జిల్లా పోలీసు కార్యాలయానికి అనుసంధానం చేస్తామని తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జిల్లా కేంద్రంలోని కమాండ్ కంట్రోల్ నుంచి నిరంతరం పర్యవేక్షిస్తామన్నారు. జిల్లాలోని అన్ని గణేష్ విగ్రహాలు, మండపాలకు జియో ట్యాగింగ్ చేసి తమకు కేటాయించిన నంబర్లతో శోభాయాత్ర ప్రశాంత వాతావరణంలో జరిగేలా పోలీసులు చర్యలు తీసుకుంటారని తెలిపారు.
భద్రత కోసం 950 మంది సిబ్బంది..
గణేష్ నిమజ్జన శోభాయాత్ర సందర్భంగా పటిష్ట భద్రత ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఒక ఏఎస్పీ, అడిషనల్ ఎస్పీ, ఐదుగురు డీఎస్పీలు, 23 మంది సీఐలు, 60 మంది ఎస్‌ఐలు, 850 మందికి పైగా ఏఎస్‌ఐలు, కానిస్టేబుళ్లు, మహిళా కానిస్టేబుల్స్, హోంగార్డులు, బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్, ఏఆర్ సిబ్బంది స్పెషల్ పార్టీతో కలిపి మొత్తం 950 మంది బందోబస్తు విధుల్లో పాల్గొంటారని తెలిపారు.
సీసీ కెమెరాలతో పర్యవేక్షణ
అన్ని పోలీస్‌స్టేషన్ల పరిధిలోని ప్రధాన రహదారులు, ప్రధాన పట్టణాల్లో గణేష్ నిమజ్జన శోభయాత్రను 24 గంటలు జిల్లా పోలీసు కార్యాలయం కమాండ్ కంట్రోల్ పర్యవేక్షిస్తుందని తెలిపారు. పోలీస్ శాఖ తరఫున, కమ్యూనిటీ పోలీసింగ్ ద్వారా ఏర్పాటు చేసిన సుమారు 1500 సీసీటీవీ కెమెరాలను ఆయా పోలీస్‌స్టేషన్లకు అనుసంధానం చేశామన్నారు.
ఫ 1500 సీసీ కెమెరాల ద్వారా పర్యవేక్షణ
ఫ నిమజ్జన ప్రాంతాల్లో గజ ఈతగాళ్లు
ఫ ఎస్పీ శరత్ చంద్ర పవార్
శోభాయాత్రలో పాల్గొనే భక్తులకు
నిబంధనలు ఇలా..
శోభాయాత్ర జరిగే ప్రాంతాల్లో ట్రాఫిక్ డైవర్షన్ ఉంటుందని ప్రజలు గమనించాలి.
గణపతి విగ్రహాల్ని తీసుకెళ్లే వాహనాలను చెకప్ చేయించుకోవాలి.
మద్యం తాగి వాహనాలను నడపొద్దు.
డీజేలకు అనుమతి లేదు. టపాకాయలు కాల్చొద్దు.
చిన్న పిల్లలు తప్పిపోయే ప్రమాదం ఉన్నందున తల్లిదండ్రులు జాగ్రత్తలు పాటించాలి.
వినాయక విగ్రహాల నిమజ్జనం జరిగే ప్రాంతాలైన చెరువుల, కాలవల వద్ద చిన్న పిల్లలకు అనుమతి లేదు.
నిమజ్జన సమయంలో యువకులు సంయమనం పాటించాలి.
జిల్లాలోని ప్రధాన నిమజ్జన ప్రాంతాలైన నల్లగొండలోని వల్లభరావు చెరువు, మూసీ రిజర్వాయర్, 14వ మైలు రాయి, మిర్యాలగూడ, వాడపల్లి, నాగార్జునసాగర్, దయ్యాలగండి, అడవిదేవులపల్లి, దేవరకొండ, కొండబీమనపల్లి, డిండి వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. నిమజ్జనం జరిగే ప్రాంతాల్లో గజ ఈతగాళ్లను అందుబాటులో ఉంచామని తెలిపారు. జిల్లాలో ఏ ప్రాంతానికి అయినా ఐదు నుంచి పది నిమిషాల వ్యవధిలో పెట్రో వాహనాలు, బ్లూకోట్స్, సంబంధిత పోలీసు అధికారులు చేరుకునేలా ఆన్‌లైన్ విధానంలో భద్రతను పర్యవేక్షిస్తున్నామని తెలిపారు. గణేష్ నిమజ్జనం రోజున జిల్లా కేంద్రంలో ప్రజలు, వాహనదారులకు ట్రాఫిక్ అంతరాయం కలగకుండా ట్రాఫిక్ డైవర్షన్ చేస్తామన్నారు.