
భూ వివాదంపై సబ్‌కలెక్టర్ విచారణ
పెద్దవూర : మండలంలోని పోతునూరు గ్రామంలో భూ వివాదంపై మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ్ అమిత్ బుధవారం విచారణ చేపట్టారు. పోతునూరు స్టేజీ వద్ద ఎన్‌హెచ్–161 పక్కన సర్వే నంబర్ 290లో గ్రామానికి చెందిన పలువురు దళితులు పూరి గుడిసెలు వేసుకున్నారు. దీంతో అదే గ్రామానికి చెందిన మేడారం యాదయ్య 290 సర్వేనంబర్‌లో తనపేరు మీద 1.12 ఎకరాల భూమి పట్టా ఉందని.. తన భూమిలో గుడిసెలు వేసుకున్నారని పోలీసులు, రెవెన్యూ అధికారులకు ఆశ్రయించాడు. దీంతో బుధవారం మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ్ అమిత్, డీఎస్పీ కె.రాజశేఖర్‌రాజు పోతునూరు స్టేజీ వద్దకు వచ్చి విచారణ చేపట్టారు. పూరి గుడిసెలు వేసుకున్న వారితో మాట్లాడారు. 2023 అక్టోబర్ 4వ తేదీన 298 సర్వే నంబర్‌లో గ్రామానికి చెందిన 58 మందికి 80 గజాల చొప్పున పట్టాలు ఇచ్చారని, ప్లాట్ నంబర్లు ఇస్తామని చెప్పి నాటి తహసీల్దార్ తమ నుంచి పట్టాలను తీసుకున్నారని తెలిపారు. కానీ ఎన్నిసార్లు అడిగినా పట్టాలు తిరిగి ఇవ్వడం లేదని వివరించారు. దీనిపై తహసీల్దార్ కార్యాలయ సిబ్బందిని అడగా.. సర్వేనంబర్ 298లో 58 మందికి పట్టాలు ఇచ్చింది వాస్తవమేనని, ప్లాటింగ్ చేసి ఇస్తామని చెప్పిన పట్టాలు తీసుకున్నామని తెలిపారు. తహసీల్దార్‌ను భూమి వివరాలు అడుగగా 2020లో సర్వే చేశారని.. 290 సర్వే నంబర్‌లో 10.17 ఎకరాల భూమి ఉండగా 2.30 ఎకరాలు ఎస్‌ఎల్‌బీసీ కాలువకు, 0.33 ఎకరాలు వాటర్ పైప్‌లైన్‌కు, 1.31 ఎకరాల భూమి పోతునూరు, పులిచర్ల రోడ్డుకు, 3.30 ఎకరాలలో నివాస గృహాలు, 1.12 ఎకరాలు మేడారం యాదయ్య పేరుమీద ఉన్నట్లు, 0.5 గుంటలు ఎన్‌హెచ్–161 రోడ్డుకు, మరో 0.16 గుంటలు ఆక్రమణకు గురైనట్లు తెలిపారు. పూర్తి వివరాలు తెలుసుకున్న సబ్ కలెక్టర్ గురువారం పెద్దవూర తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లాలని గుడిసెలు వేసుకున్న వారికి సూచించారు. అక్కడ న్యాయం జరగలేదని భావిస్తే.. కోర్టుకు వెళ్లవచ్చని పేర్కొన్నారు. అయితే ఈ వివాదం సద్దుమణిగే వరకు తమ గుడిసెల జోలికి ఎవరూ రావద్దని సబ్ కలెక్టర్‌కు వారు విన్నవించారు. ఆయన వెంట తహసీల్దార్ శాంతిలాల్, డీటీ శ్రీదేవి, సాగర్ సీఐ శ్రీనునాయక్, ఎస్‌ఐలు ప్రసాద్, ముత్తయ్య, ఆర్‌ఐ దండ శ్రీనివాస్‌రెడ్డి తదితరులు ఉన్నారు.