మూసీలో చిక్కుకున్న యువకుడు సురక్షితం | - | Sakshi
Sakshi News home page

మూసీలో చిక్కుకున్న యువకుడు సురక్షితం

Sep 1 2025 10:15 AM | Updated on Sep 1 2025 10:15 AM

మూసీలో చిక్కుకున్న యువకుడు సురక్షితం

మూసీలో చిక్కుకున్న యువకుడు సురక్షితం

రామన్నపేట : ప్రమాదవశాత్తు మూసీనదిలో పడి వరద ప్రవాహంలో చిక్కుకున్న యువకుడు కానుకుంట్ల మత్స్యగిరిని ఎస్‌డీఆర్‌ఎఫ్‌, ఫైర్‌ సిబ్బంది శనివారం ఉదయం సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. రామన్నపేట మండలం లక్ష్మాపురం గ్రామానికి చెందిన మత్స్యగిరి శుక్రవారం సాయంత్రం ఏడు గంటల సమయంలో గ్రామం సమీపంలోని మూసీ వంతెనపై నుంచి ప్రమాదవశాత్తు మూసీనదిలో పడిపోయాడు. వరద ప్రవాహానికి సుమారు మూడువందల మీటర్ల దూరం వరకు కొట్టుకుపోయాడు. అదృష్ట వశాత్తు చెట్టును ఆసరా చేసుకొని పెద్ద మట్టిదిబ్బపైకి చేరాడు. అక్కడ ఉన్న వారు గమనించి వెంటనే పోలీసు, రెవెన్యూ, ఫైర్‌ సిబ్బందికి సమాచారం అందించారు. తహసీల్దార్‌ లాల్‌బహదూర్‌శాస్త్రి, సీఐ ఎన్‌.వెంకటేశ్వర్లు సంఘటనా స్థలానికి చేరుకొని ఉన్నతాధికారులకు సమాచారమిచ్చారు. ఉన్నతాధికారుల ఆదేశం మేరకు యాదగిరిగుట్ట నుంచి ఎస్‌డీఆర్‌ఎఫ్‌ బృందాన్ని రప్పించారు. యువకుడిని రక్షించేందుకు నదిలోకి పడవలో వెళ్లిన ఎస్‌డీఆర్‌ఎఫ్‌ బృందంలోని ఒక సభ్యుడు నదిలో పడిపోగా మిగిలిన సభ్యులు అతడిని చాకచక్యంగా రక్షించారు. అనంతరం ఎస్‌డీఆర్‌ఎఫ్‌ బృందం సభ్యులు మత్స్యగిరి ఉన్న ప్రదేశానికి చేరుకోవడానికి విశ్వ ప్రయత్నం చేశారు. చీకటిగా ఉండడం, నది ప్రవాహం ఉధృతంగా పారుతుండడంతో అతడి వద్దకు చేరుకోలేక పోయారు. రాత్రి 12 గంటల తరువాత సహాయక చర్యలు నిలిపివేశారు.

రాతంత్రా వంతెనపైనే కాపాలా..

మత్స్యగిరికి వెలుతురు కనిపించేలా అధికారులు అర్ధరాత్రి ట్రాక్టర్‌ లైట్లు ఏర్పాటు చేశారు. కుటుంబసభ్యులు, గ్రామ పంచాయతీ సిబ్బంది, స్థానిక యువకులు వంతెనపైనే రాత్రంగా అతడిని గమనిస్తూ కాపాలా కాశారు. స్థానిక గ్రామ పంచాయతీ భవనంలోనే సేదదీరిన ఎస్‌డీఆర్‌ఎఫ్‌ బృందం శనివారం తెల్లవారుజామున 5గంటలకే సహాయక చర్యలను మొదలు పెట్టారు. ఉదయం 6:45 గంటలకు మత్స్యగిరిని సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. దీంతో గ్రామస్తులు, కుటుంబ సభ్యులు, అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ప్రాణాలను పణంగా పెట్టి మత్స్యగిరిని కాపాడిన ఎస్‌డీఆర్‌ఎఫ్‌ బృందం సభ్యులను గ్రామస్తులు, అధికారులు అభినందించారు. నకిరేకల్‌ ఎమ్మెల్యే వేముల వీరేశం, కలెక్టర్‌ హనుమంతరావు రాత్రంతా సహాయక చర్యలను పర్యవేక్షించారు. బయటకు వచ్చిన మత్స్యగిరి కలెక్టర్‌ ఫోన్‌లో పరామర్శించారు. ఆర్డీఓ శేఖర్‌రెడ్డి, ఏసీపీ మధుసూదన్‌రెడ్డి, డీఎఫ్‌ఓ మధుసూదన్‌రావు, ఎస్‌ఎఫ్‌ఓ మధుసూదన్‌రెడ్డిలు సహాయక చర్యలను పర్యవేక్షించారు. సీఐ ఎన్‌.వెంకటేశ్వర్లు ఆధ్వర్యలో ఎస్‌ఐలు డి.నాగరాజు, యుగంధర్‌లు సహాయక చర్యలకు ఆటంకం కలగకుండా బందోబసు ఏర్పాటు చేశారు.

ఫ రాత్రంతా నదిలోనే మట్టిదిబ్బపై ఉన్న బాధితుడు మత్స్యగిరి

ఫ శనివారం తెల్లవారుజామున ఒడ్డుకు చేర్చిన ఎస్‌డీఆర్‌ఎఫ్‌ బృందం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement