కల్తీదాణా తయారు చేస్తున్న ఇద్దరి అరెస్ట్‌ | - | Sakshi
Sakshi News home page

కల్తీదాణా తయారు చేస్తున్న ఇద్దరి అరెస్ట్‌

Sep 1 2025 10:15 AM | Updated on Sep 1 2025 10:15 AM

కల్తీదాణా తయారు చేస్తున్న ఇద్దరి అరెస్ట్‌

కల్తీదాణా తయారు చేస్తున్న ఇద్దరి అరెస్ట్‌

కేతేపల్లి: కల్తీ దాణాను తయారు చేసి కోళ్ల ఫామ్స్‌ యజమానులకు విక్రయిస్తున్న ఇద్దరు నిందితులను శనివారం కేతేపల్లి పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. కేసుకు సంబంధించి వివరాలను శనివారం కేతేపల్లి పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో శాలిగౌరారం సీఐ కొండల్‌రెడ్డి వెల్లడించారు. కేతేపల్లి మండలం చీకటిగూడెం గ్రామానికి చెందిన ఆల్దాసు సతీష్‌, బుద్దె కృష్ణలు సూర్యాపేట పట్టణంతోపాటు పరిసర ప్రాంతాల్లోని రైస్‌ మిల్లుల నుంచి నూకలు, తవుడు సేకరించి కోళ్ల ఫారాలకు దాణాను విక్రయిస్తున్నారు. వ్యాపార నిర్వహణ కోసం కేతేపల్లిలోని పడావుగా ఉన్న పాత రైస్‌మిల్‌ గోదామును కిరాయికి తీసుకున్నారు. అయితే తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో నూకలు, తవుడుతో కూడిన దాణాలో 30శాతం ఇసుకను కలిపి కల్తీ దాణాను తయారు చేసే దందాకు తెరలేపారు. తయారు చేసిన కల్తీ దాణాను డీసీఎంలో లోడ్‌ చేసి ఎలాంటి అనుమతులు లేకుండానే హైదరాబాద్‌ పరిసర ప్రాంతాల్లోని కోళ్ల ఫారాల యజమానులకు అధిక ధరలకు విక్రయిస్తూ డబ్బులు సంపాదిస్తున్నారు. కోళ్ల కల్తీ దాణా తయారీ దందాపై స్థానిక పంచాయతీ కార్యదర్శి సయ్యద్‌బాబా చేసిన ఫిర్యాదు మేరకు కేతేపల్లి ఎస్‌ఐ సతీష్‌ శనివారం తన సిబ్బందితో కలిసి గోదాముపై దాడి చేశారు. తనిఖీలో గోదాములో నిల్వ ఉన్న రూ.3.30 లక్షల విలువైన 245 బ్యాగుల కల్తీ కోళ్ల దాణా (122.5 క్వింటాళ్లు), 8 టన్నుల ఇసుకను పోలీసులు సీజ్‌ చేశారు. ఈ దాణా తిన్న కోళ్లతోపాటు వాటిని తిన్న మనుషుల ఆరోగ్యాలకు కూడా ముప్పు పొంచి ఉందని సీఐ తెలిపారు. విచారణ అనంతరం కల్తీ దాణా తయారు చేస్తున్న సతీష్‌, కృష్ణలను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించామని సీఐ వివరించారు. వారినుంచి డీసీఎం, టాటా నెక్సాన్‌ కారు, రెండు సెల్‌ఫోన్‌లను స్వాధీనం చేసుకున్నామని పేర్కొన్నారు. సమావేశంలో కేతేపల్లి ఎస్‌ఐ యు.సతీష్‌, సిబ్బంది అనిల్‌రెడ్డి, సతీష్‌, సైదులు, రాంబాబు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement