
పత్తిచేలు వర్షార్పణం
ఫ జాలు పట్టి ఎర్రబారిన పత్తి మొక్కలు
ఫ నకిరేకల్ వ్యవసాయ డివిజన్ పరిధిలోని 3వేల ఎకరాల్లో నష్టం
నకిరేకల్ శివారులో మూసీ రోడ్డులో 12 ఎకరాలు కౌలుకు తీసుకుని పత్తి సాగు చేశాను. ఎకరానికి రూ.13 వేల చొప్పును కౌలుకు చెల్లించాను. సూమారు రూ.5లక్షల వరకు పెట్టుబడి పెట్టాను. 12 ఎకరాల్లో.. 10 ఎకరాలు వర్షంతో జాలు పట్టింది. పత్తి చేను కళ్ల ముందు వాడిపోయి ఎర్రబారుతోంది. వర్షాలతో నష్టపోయిన రైతులను గుర్తించి ప్రభుత్వం పంట నష్టపరిహారం అందించాలి.
– వీరబోయిన రమేష్, రైతు, కేతేపల్లి
వర్షాల వచ్చిన సమయంలో పత్తి చేలలో నీరు నిలవకుండా చూసుకోవాలి. చేలలోకి వచ్చిన నీరు వెంటనే తీసివేయాలి. తెగుళ్ల నివారణకు వ్యవసాయాధికారుల సలహల మేరకు సస్యరక్షణ చర్యలు చేపట్టాలి.
– ఎండీ.జానిమియా, ఏడీఏ, నకిరేకల్
నకిరేకల్ : ఇటీవల కురిసిన వర్షాలకు పత్తి చేలు దెబ్బతిన్నాయి. ప్రధానంగా నల్లరేగడి భూముల్లో సాగు చేసిన పత్తి పంటకు భారీగా నష్టం వాటిల్లింది. చేలలో నీరు నిలిచి మొక్కలు ఎర్రబారాయి. నకిరేకల్ వ్యవసాయ డివిజన్ పరిధిలోని నకిరేకల్, కేతేపల్లి, కట్టంగూరు, శాలిగౌరారం మండలాల్లో సుమారు 3 వేల ఎకరాల పత్తి చేలు జాలు పట్టి దెబ్బతిన్నాయి. చేతికొచ్చే దశలో పంట దెబ్బతినడంతో రైతుల ఆవేదన చెందుతున్నారు. పెట్టిన పెట్టుబడి కూడా భుమిలో కలిసిపోయందని వాపోతున్నారు.
70,332 ఎకరాల్లో పత్తి సాగు
నకిరేకల్ వ్యవసాయ డివిజన్ వ్యాప్తంగా ఈ వానాకాలం సీజన్‌లో 1,15,954 ఎకరాల్లో వరి, 70,332 ఎకరాల్లో పత్తి, కంది, పెసర, జిలుగు, వేరుశనగ తదితర పంటలు 3,820 ఎకరాల్లో సాగు చేశారు. ఆయా మండలాల్లో ఇటీవల కురిసిన ముసురు వర్షాలతో నల్లరేగడి భూముల్లో సాగు చేసిన పత్తి పంటలకు నష్టం వాటిల్లింది. నకిరేకల్ మండలంలోని నోముల, తాటికల్, ఓగోడు, పాలెం, వల్లాబాపురం, నడిగూడెం, కేతేపల్లి మండం గుడివాడ, కాసనగోడు, బొప్పారం, కొత్తపేట, శాలిగౌరారం మండలం ఊట్కురు, వల్లాల, అడ్లూరు, చిత్తలూరు, ఇటుకులపహాడ్, వంగమర్తి, ఆకారం, కట్టంగూరు మండలం ఈదూలురు, బొల్లేపల్లి, మునుకుంట్ల, పరడ, కురుమర్తి తదితర గ్రామాల్లో సుమారు 3 వేల ఎకరాల్లో పత్తి పంట దెబ్బతిన్నాయి.
పత్తి చేలు వదిలేయాల్సిందే..
ఈ ఏడాది అదునుకు వర్షాలు కురవడంతో ఎంతో ఆశతో రైతులు పత్తిసాగుకు పూనుకున్నుఆరు. రెండు నెలల నుంచి భారీగా పెట్టుబడులు పెట్టారు. ముసురు వర్షాలతో పత్తిచేలలో నీరు నిలిచి జాలు పట్టడంతోపాటు తెగుళ్లుతో పత్తి పంటకు తీవ్ర నష్టం వాటిల్లింది. నల్లరేగడి భూముల్లోకి వెళ్లే పరిస్థితి కూడా లేదు. ఆ భూముల్లో సాగు అయిన పత్తి చేలు వాడు పట్టి ఎండిపోయాయి. దీంతో ఆయా గ్రామాల్లో రైతులు చేలను వదిలివేయాల్సిన వస్తోందని ఆవేదన చెందుతున్నారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని కోరుతున్నారు.

పత్తిచేలు వర్షార్పణం

పత్తిచేలు వర్షార్పణం

పత్తిచేలు వర్షార్పణం