‘దివీస్‌’తో కుమ్మక్కై అలైన్‌మెంట్‌ మార్చారు | - | Sakshi
Sakshi News home page

‘దివీస్‌’తో కుమ్మక్కై అలైన్‌మెంట్‌ మార్చారు

Aug 30 2025 10:17 AM | Updated on Aug 30 2025 12:19 PM

Regional Ring Road residents presenting a petition to MLA Rajagopal Reddy

ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డికి వినతిపత్రం అందజేస్తున్న రీజినల్ రింగ్ రోడ్డు నిర్వాసితులు

మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ఆరోపణ

రీజినల్‌ రింగ్‌ రోడ్డు నిర్వాసితులతో సమావేశం

చౌటుప్పల్‌ : గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో దివీస్‌ పరిశ్రమతో కుమ్మక్కై రీజినల్‌ రింగ్‌ రోడ్డు అలైన్‌మెంట్‌ను మార్చారని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ధ్వజమెత్తారు. చౌటుప్పల్‌ మున్సిపాలిటీకి దూరంగా వెళ్లాల్సిన ట్రిపుల్‌ ఆర్‌ను నాటి ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికారులు కలిసి మున్సిపాలిటీలోకి తీసుకువచ్చారని ఆరోపించారు. 

చౌటుప్పల్‌ మున్సిపాలిటీ పరిధి లక్కారంలోని తన క్యాంపు కార్యాలయంలో శుక్రవారం ఆయన ట్రిపుల్‌ ఆర్‌ భూ నిర్వాసితులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. రైతులు, నిర్వాసితుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. తరతరాలుగా భూమినే నమ్ముకొని జీవనం సాగిస్తున్న తమకు న్యాయం చేయాలని, భూమికి భూమి లేదంటే బహిరంగ మార్కెట్‌లో ఉన్న ధర ప్రకారంగా పరిహారం ఇప్పించాలని నిర్వాసితులు వేడుకున్నారు. 

అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. అలైన్‌మెంట్‌ను నిబంధనలకు విరుద్ధంగా మార్చి ఈ ప్రాంతానికి తీరని అన్యాయం చేశారని అన్నారు. రైతులకు, నిర్వాసితులకు అన్యాయం చేసిన వ్యక్తులే ఇప్పుడు వారిని రెచ్చగొడుతూ ధర్నాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మోసగాళ్లు ఎవరో, మోసం చేసినవారు ఎవరో, మొసలి కన్నీరు కారుస్తున్నవారెవరో తనకు పూర్తిగా తెలుసన్నారు. ఏ ఒక్క శాతం అవకాశం ఉన్నా అలైన్‌మెంట్‌ను మార్పిస్తానని, లేనిపక్షంలో అధిక మ్తొతంలో పరిహారాన్ని ఇప్పించేందుకు కృషిచేస్తానని అన్నారు. ఈ సమస్యను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తానని తెలిపారు. కేంద్రమంత్రి నితిన్‌ గడ్గరీతో స్వయంగా మాట్లాడి సమస్యపై చర్చిస్తానని హామీ ఇచ్చారు. 

ట్రిపుల్‌ ఆర్‌ ప్రక్రియ ఎంత వరకు వచ్చిందని ఆర్డీవోకు శేఖర్‌రెడ్డిని ఫోన్‌లో అడిగారు. రైతులు అంగీకరిస్తే పరిహారం వారి అకౌంట్‌లలో జమ అవుతాయని ఆర్డీవో చెప్పారు. పరిహారం విషయం తేలనందున ప్రస్తుతం అన్ని రకాల ప్రక్రియలను ఆపాలని ఆర్డీవోను ఎమ్మెల్యే ఆదేశించారు. ట్రిపుల్‌ఆర్‌ సమస్య తనతో పరిష్కారం కాకుంటే.. దేవుడితో కూడా అవ్వదన్నారు. కొందరి మాటలు నమ్మి తనపై అపోహలకు పోవద్దని, తాను ప్రజలందరికీ ఎమ్మెల్యేనన్న విషయాన్ని అందరూ గుర్తుంచుకోవాలన్నారు. ఏ ఒక్కరికి అన్యాయం జరిగినా తాను భరించలేనన్నారు.

సమస్యను పరిష్కరించే బాధ్యత తనదేనని తెలిపారు. ఈ సమావేశంలో మార్కెట్‌ చైర్మన్‌ ఉబ్బు వెంకటయ్య, మాజీ మున్సిపల్‌ చైర్మన్‌ వెన్‌రెడ్డి రాజు, మాజీ ఎంపీపీ చిలుకూరి ప్రభాకర్‌రెడ్డి, నాయకులు పబ్బు రాజుగౌడ్‌, ఆకుల ఇంద్రసేనారెడ్డి, వెల్గ రాజశేఖర్‌రెడ్డి, సుర్వి నర్సింహ, మొగుదాల రమేష్‌, కాసర్ల శ్రీనివాస్‌రెడ్డి, ఎండి.హన్నుభాయ్‌, బొంగు జంగయ్య, నిర్వాసితులు రాములు, ప్రకాష్‌రెడ్డి, మల్లేష్‌గౌడ్‌, ఉపేందర్‌రెడ్డి, జాల శ్రీశైలం, నాగెల్లి దశరథ, జాల జంగయ్య తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement