సీపోర్టుకు.. సీఎంఆర్‌! | - | Sakshi
Sakshi News home page

సీపోర్టుకు.. సీఎంఆర్‌!

Aug 6 2025 11:56 AM | Updated on Aug 6 2025 11:56 AM

సీపోర్టుకు.. సీఎంఆర్‌!

సీపోర్టుకు.. సీఎంఆర్‌!

సాక్షి ప్రతినిధి, నల్లగొండ : ప్రభుత్వానికి రావాల్సిన కస్టం మిల్లింగ్‌ రైస్‌ (సీఎంఆర్‌) పక్కదారి పడుతోంది. ప్రభుత్వం నుంచి తీసుకున్న ధాన్యానికి సంబంధించి మిల్లర్లు కొందరు సీఎంఆర్‌ ఇవ్వకుండా ఆ బియ్యాన్ని కాకినాడ పోర్టుకు తరలించి విదేశాల్లో విక్రయించి రూ.కోట్లు అర్జిస్తున్నారు. జిల్లాలోని ఆరు మిల్లులు సీఎంఆర్‌ పక్కదారి పట్టించినట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి, పౌరసరఫరాల శాఖ కమిషనర్‌కు ఫిర్యాదులు అందాయి. దీంతో రాష్ట్ర పౌరసరఫరాల శాఖ రంగంలోకి దిగింది. ఈ అక్రమాన్ని నిగ్గు తేల్చేందుకు సిద్ధమైంది.

మిల్లుల్లో లేని 4.15 లక్షల క్వింటాళ్ల ధాన్యం

జిల్లాలోని ఆరు మిల్లుల్లో 4.15 లక్షల క్వింటాళ్లకు పైగా ధాన్యం మిల్లుల నుంచి మాయమైనట్లు ఆరోపణలు ఉన్నాయి. గత జనవరిలో అధికారులు ఆయా మిల్లుల్లో తనిఖీ చేసినప్పుడు కూడా ధాన్యం క్షేత్రస్థాయిలో లేవని తేలింది. ఆ ధాన్యానికి సంబంధించిన 2.75 లక్షల క్వింటాళ్ల బియ్యం కాకినాడ పోర్టుకు తరలినట్లు తెలిసింది.

15 రోజుల్లో సీఎంఆర్‌ ఇవ్వాలి..

ప్రభుత్వం రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యాన్ని మిల్లర్లకు ఇస్తే, ఆ ధాన్యం అందిన 15 రోజుల్లో మిల్లర్లు వాటిని మర ఆడించి సీఎంఆర్‌ కింద తిరిగి సివిల్‌ సప్లయ్‌ శాఖకు క్వింటా ధాన్యానికి 68 కిలోల బియ్యాన్ని అందించాలి. కానీ జిల్లాలోని నల్లగొండ, మునుగోడు, చిట్యాల ప్రాంతాలకు చెందిన ఆరు మిల్లుల యజమానులు ఆ బియ్యాన్ని ప్రభుత్వానికి ఇవ్వకుండా కాకినాడ పోర్టుకు తరలించినట్లు తెలిసింది. దీనిపై గతంలోనే అధికారులకు ఫిర్యాదులు అందినా, తనిఖీల్లో ధాన్యం లేదని తేలినా అధికారుల్లో మాత్రం చలనం లేకుండా పోయింది. రూ.కోట్ల రూపాయల సీఎంఆర్‌ ఏళ్ల తరబడి ప్రభుత్వానికి ఇవ్వకున్నా స్పందించకపోవడంపై ప్రజలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.

ఆ ఆరు మిల్లులపై

ఎన్నో ఆరోపణలు

● జిల్లా కేంద్రానికి సమీపంలోని మండలానికి చెందిన ఓ మిల్లుకు 2022–23 యాసంగి సీజన్‌కు సంబంధించి సీఎంఆర్‌ కోసం 1,18,132 క్వింటాళ్ల ధాన్యం ఇవ్వగా, 30,450 క్వింటాళ్ల బియ్యం ఇచ్చింది. అయితే గతేడాది ఆ మిల్లుల్లో మిగిలి ఉన్న ధాన్యాన్ని ప్రభుత్వం వేలం వేయడంతో 13,789 క్వింటాళ్ల ధాన్యాన్ని కొనుగోలుదారుడు తీసుకెళ్లారు. ఇంకా మిల్లులో 59,539 క్వింటాళ్ల ధాన్యం మిల్లులో ఉండాల్సి ఉన్నా అక్కడ లేనట్లు తెలుస్తోంది.

● నల్లగొండకు చెందిన ఓ మిల్లుకు కేటాయింపు, ఇచ్చింది పోగా, ఇంకా 3,17,492 క్వింటాళ్ల ధాన్యం మిల్లులో ఉండాల్సి ఉన్నా అక్కడ 2,39,381 క్వింటాళ్లే ఉందని, 78,110 క్వింటాళ్ల ధాన్యం మాయం అయిందన్న ఆరోపణలు ఉన్నాయి.

● మునుగోడుకు చెందిన ఓ మిల్లులోనూ 4,500 క్వింటాళ్ల ధాన్యం, నల్లగొండలోని ఇంకో మిల్లులో ఉండాల్సిన 34,622 మెట్రిక్‌ టన్నుల ధాన్యం పక్కదారి పట్టించారని తెలుస్తోంది.

● నల్లగొండకు చెందిన మరో మిల్లులోనూ 1,59,803 క్వింటాళ్లు, మరో మిల్లులో 79,133 క్వింటాళ్ల ధాన్యం ఉండాల్సి ఉన్నా, దానిని ఆయా మిల్లులు పక్కదారి పట్టించినట్లు ప్రభుత్వానికి ఫిర్యాదులు అందాయి.

2.75 లక్షల క్వింటాళ్ల బియ్యం కాకినాడకు తరలింపు

ఫ జిల్లాలోని ఆరు మిల్లుల్లో అక్రమాలు

ఫ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి అందిన ఫిర్యాదు

ఫ విచారణ చేపట్టిన పౌరసరఫరాల శాఖ

బియ్యం అమ్ముకుంటున్న మిల్లులు

జిల్లాలో పలు మిల్లులు ఇప్పటికే పీడీఎస్‌ బియ్యం దందా చేస్తుండగా, ఇప్పుడు ప్రభుత్వానికి ఇవ్వాల్సిన బియ్యాన్ని అమ్ముకుంటున్నాయి. ప్రభుత్వాన్ని మోసం చేస్తూ అడ్డగోలుగా వ్యవహరిస్తున్నా సంబంధిత అధికారులు మిల్లర్లకు సహకరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. వారి అండదండలతోనే 2022–23 నుంచి 2024–25 యాసంగి సీజన్‌ వరకు ఇవ్వాల్సిన సీఎంఆర్‌ ఇవ్వకపోగా, అందులో కొంత వేలం వేసిన ధాన్యానికి సంబంధించి ధాన్యాన్ని కూడా అప్పగించకుండా, డబ్బులు ఇవ్వకుండా ప్రభుత్వానికి రూ.కోట్లలో నష్టం చేకూర్చి ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement