
కాళేశ్వరంపై కాంగ్రెస్ విషం చిమ్ముతోంది
నల్లగొండ టూటౌన్ : లక్షలాది ఎకరాలకు సాగునీరు అందించిన కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ ప్రభుత్వం కమిషన్ పేరుతో విషం చిమ్ముతూ.. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రి హరీష్‌రావుపై కుట్రలు చేస్తోందని బీఆర్‌ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు రమావత్ రవీంద్రకుమార్ అన్నారు. మంగళవారం హైదరాబాద్ నుంచి మాజీ మంత్రి హరీష్‌రావు కాళేశ్వరం ప్రాజెక్టుపై నిర్వహించిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌ను నల్లగొండలోని బీఆర్‌ఎస్ కార్యాలయంలో ఆయన.. ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు చిరుమర్తి లింగయ్య, కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, నోముల భగత్, రాష్ట్ర నాయకుడు కంచర్ల కృష్ణారెడ్డి, నాయకులతో కలిసి వీక్షించారు. అనంతరం రవీంద్రకుమార్ విలేకరులతో మాట్లాడారు. కాళేశ్వరంపై హరీష్‌రావు పవర్ పాయింట్ ప్రజెంషన్‌లో చాలా స్పష్టంగా కాంగ్రెస్ కుట్రలను ఎండగట్టారని తెలిపారు. ప్రాజెక్టులు ఏం జరగకపోయినా జరిగి నట్లు సీఎం రేవంత్‌రెడ్డి అభూతకల్పన సృష్టిస్తున్నారని మండిపడ్డారు. అన్ని అనుమతులతో గోదావరిపై బ్యారేజ్‌లు నిర్మించిన ఘనత కేసీఆర్‌కు దక్కుతుందన్నారు. కాళేశ్వరంపై కమిషన్ రిపోర్ట్ కూడా ప్రజలను తప్పుదోవ పట్టించేలా ఉందని, పూర్తి అబద్దాలు చెప్పారని ధ్వజమెత్తారు. కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ మందడి సైదిరెడ్డి, చీర పంకజ్‌యాదవ్, అభిమన్యు శ్రీనివాస్, సింగం రామ్మోహన్, బక్క పిచ్చయ్య తదితరులు పాల్గొన్నారు.

కాళేశ్వరంపై కాంగ్రెస్ విషం చిమ్ముతోంది