
బీజేపీవి మతోన్మాద రాజకీయాలు
దేవరకొండ : రాజకీయ అధికారాన్ని సుస్థిరం చేసుకోవడానికి బీజేపీ.. మతోన్మాద రాజకీయాలను రెచ్చగొడుతోందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. మంగళవారం దేవరకొండలోని మందడి నర్సింహ్మారెడ్డి ప్రాంగణంలో నిర్వహించిన సీపీఐ 23వ జిల్లా మహాసభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. అసమానతలు లేని సమాజం నిర్మించడమే కమ్యూనిస్టుల లక్ష్యమని అన్నారు. కమ్యూనిజానికి అంతం లేదని.. మానవ సమాజం ఉన్నంత వరకు కమ్యూనిజం ఉంటుందన్నారు. కాంగ్రెస్, బీజేపీ లాంటి ఇతర బూర్జువా పార్టీలు వారి ప్రాంతాలకు మాత్రమే పరిమితమని పేర్కొన్నారు. ఆపరేషన్ కగార్ పేరుతో 2026మార్చి వరకు మావోయిస్టులను అంతం చేస్తామని కేంద్ర హోం మంత్రి అమిత్ షా వరకు చెప్పడం దుర్మార్గమన్నారు. కమ్యూనిస్టులంతా ఒకతాటి పైకి వస్తే దోపిడీ వర్గాల రాజ్యాన్ని కూల్చవచ్చన్నారు. త్వరలో జరుగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కమ్యూనిస్టు పార్టీ అభ్యర్థులు అధిక స్థానాల్లో గెలుపొందాలని ఆకాంక్షించారు. మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగార్ పేరుతో కమ్యూనిజాన్ని అంతం చేయాలని చేస్తున్న కుట్రలు సమంజసం కాదన్నారు. ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం మాట్లాడుతూ నల్లగొండ జిల్లాలో పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులకు ప్రభుత్వం అధిక నిధులు కేటాయించి త్వరితగతిన పూర్తి చేయాలని కోరారు. అంతకుముందు సీపీఐ జాతీయ సమితి సభ్యుడు పల్లా వెంకట్‌రెడ్డి పార్టీ జెండాను ఆవిష్కరించారు. పల్లా దేవేందర్‌రెడ్డి, వెంకటేవ్వర్లు, బొల్లె మంజుల అధ్యక్షతన వహించిన ఈ మహాసభలో సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు పల్లా నర్సింహారెడ్డి, మల్లేపల్లి ఆదిరెడ్డి, ఉజ్జిని రత్నాకర్‌రావు, ఉజ్జిని యాదగిరిరావు, కాంతయ్య, అంజయ్యనాయక్, పల్లె నర్సింహ, శ్రవణ్‌కుమార్, వీరస్వామి, అంజాచారి, వెంకటరమణ, నర్సింహ పాల్గొన్నారు.
ఫ అసమానతలు లేని సమాజ నిర్మాణమే కమ్యూనిస్టుల లక్ష్యం
ఫ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు
ఫ దేవరకొండలో సీపీఐ జిల్లా మహాసభ