
సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి
పెద్దఅడిశర్లపల్లి : వర్షాకాలం నేపథ్యంలో సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. పెద్దఅడిశర్లపల్లి మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని గురువారం ఆమె సందర్శించారు. ఈ సందర్భంగా రికార్డులు పరిశీలించారు. వైద్య సేవలకు అనుగుణంగా మందులు సిద్ధంగా ఉంచాలని సూచించారు. వైద్యులు ప్రజలకు అందుబాటులో ఉండాలన్నారు. అనంతరం పీఏపల్లి మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో రికార్డులు పరిశీలించి భూభారతిలో వచ్చిన దరఖాస్తులపై ఆరా తీశారు. తహసీల్దార్ కార్యాలయానికి వచ్చిన రైతులతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం కస్తూర్బా గాంధీ పాఠశాలను తనిఖీ చేశారు. వంట గదులు, పాఠశాల పరిశుభ్రత, టాయిలెట్ల నిర్వహణ, విద్యార్థులకు అందించే భోజన సదుపాయాలపై ఆరా తీశారు. ఆమె వెంట ఆర్డీఓ రమణారెడ్డి, తహసీల్దార్ జయశ్రీ, సిబ్బంది తదితరులున్నారు.
5న ఉమ్మడి నల్లగొండ అండర్ 19 క్రికెట్ జట్టు ఎంపిక
నల్లగొండ టౌన్ : హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్, జిల్లా క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 5న నల్లగొండలోని మేకల అభినవ్ స్టేడియంలో ఉమ్మడి నల్లగొండ జిల్లా అండర్ 19 జిల్లా క్రికెట్ జట్టు ఎంపిక చేయనున్నట్లు జిల్లా అసోసియేషన్ కార్యదర్శి సయ్యద్ అమీనుద్దిన్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. జట్టు ఎంపిక ఉదయం 10 గంటల నుంచి ప్రారంభం అవుతుందని పేర్కొన్నారు. సెప్టెంబర్ 2006 తరువాత జన్మించిన వారు అర్హులని తెలిపారు. ఇతర వివరాలకు 98857 17996 నంబర్‌ను సంప్రదించాలని పేర్కొన్నారు.
హౌస్ కీపింగ్ నిర్వహణకు దరఖాస్తుల స్వీకరణ
రామగిరి(నల్లగొండ): నిడమనూరు కోర్టులో హౌస్ కీపింగ్ సర్వీసెస్ నిర్వహణకు ఆసక్తి గల సంస్థలు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి నాగరాజు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. జూలై 8వ తేదీ లోపు దరఖాస్తులు సమర్పించాలని పేర్కొన్నారు. పూర్తి వివరాలకు www.nalgonda.dcour-ts.go v.in వెబ్‌సైట్‌ను సందర్శించాలని కోరారు.
సీఎంఆర్ లక్ష్యాన్ని
వారంలో పూర్తి చేయాలి
నల్లగొండ: సీఎంఆర్ లక్ష్యాన్ని వారంలోపు పూర్తిచేయాలని అదనపు కలెక్టర్ శ్రీనివాస్ సూచించారు. గురువారం కలెక్టరేట్‌లో జిల్లాలోని రైస్ మిల్లర్లు, పౌరసరఫరాల శాఖ అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. 2023– 24 రబీ సీఎంఆర్‌కు సంబంధించి ఇంకా 73 ఏసీకే లు చెల్లించాల్సి ఉందన్నారు. రైస్ మిల్లర్లు వారం రోజుల్లో చెల్లించడంతోపాటు, 2024– 25 రబీకి సంబంధించిన సీఎంఆర్‌ను సైతం వేగవంతం చేయాలన్నారు. పౌర సరఫరాల విభాగం డిప్యూటీ తహసీల్దార్లు ప్రతిరోజు పర్యవేక్షించాలన్నారు. సమావేశంలో జిల్లా పౌర సరఫరాల అధికారి వెంకటేశం, పౌరసరఫరాల జిల్లా మేనేజర్ హరీష్, రైస్ మిల్లర్ల సంఘం అధ్యక్ష, కార్యదర్శులు నారాయణ, శ్రీనివాస్, రైస్ మిల్లర్లు తదితరులు పాల్గొన్నారు.
చిరుధాన్యాల సాగుకు ప్రోత్సాహం
నల్లగొండ అగ్రికల్చర్ : జాతీయ ఆహార భద్రత మిషన్ పథకం కింద జిల్లాలో అపరాలు, చిరుధాన్యాల సాగును ప్రోత్సహించనున్నట్లు జిల్లా వ్యవసాయాధికారి పాల్వాయి శ్రవణ్‌కుమార్ గురువారం తెలిపారు. పథకం కింద ఆయా పంటలకు అవసరమైన మినీ కిట్లు జిల్లాకు వచ్చినట్లు పేర్కొన్నారు. జొన్నల సాగు 100 ఎకరాల్లో ప్రోత్సహించడానికి అవసరమైన 100 కిట్లు, రాగుల సాగు 645 ఎకరాలకు అవసరమైన 645 మినీ కిట్లు, 250 ఎకరాల్లో మినుముల సాగుకు అవసరమైన 500 కిట్లు, 750 ఎకరాల్లో కంది సాగుకు అసరమైన 1500 మినీ కిట్లు జిల్లాకు వచ్చినట్లు తెలిపారు. వాటిని మండలాల వారీగా కేటాయించి రైతులకు ఉచితంగా అందజేస్తామని పేర్కొన్నారు.

సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి