
అవార్డులకు దరఖాస్తుల ఆహ్వానం
నల్లగొండ : జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు–2025 సంవత్సరానికి అర్హత గల ఉపాధ్యాయులు దరఖాస్తులు చేసుకోవాలని డీఈఓ భిక్షపతి సోమవారం ఒక ప్రకటనలో కోరారు. ఆసక్తి గల ఉపాధ్యాయులు natio nalawardstoteachers.education.gov.inలో వెబ్‌సైట్ ద్వారా నెల 13వ తేదీలోగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. ఇతర వివరాలు వెబ్‌సైట్ ద్వారా చూసుకోవచ్చని, రిజిస్ట్రేషన్ చేసిన కాపీని డీఈఓ కార్యాలయంలో సమర్పించాలని పేర్కొన్నారు.
ఏడాదిలో డీసీసీబీ టర్నోవర్ పెరిగింది
నల్లగొండ అగ్రికల్చర్ : డీసీసీబీలో తమ పాలకవర్గం ఏర్పడిన సంవత్సరం కాలంలో ఎన్నడూ లేని విధంగా రూ.598.16 కోట్లుకు టర్నోవర్ పెరిగి మొత్తం రూ.2940.29 కోట్లకు చేరుకుందని డీసీసీబీ చైర్మన్ కుంభం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. పాలకవర్గం ఏర్పడి సంవత్సరం పూర్తయిన సందర్భంగా సోమవారం డీసీసీబీలో కేక్ కట్‌చేసి సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ పాలకవర్గం బాధ్యతలు స్వీకరించిన వెంటనే పంట రుణాల గరిష్ట పరిమితిని రూ.లక్ష నుంచి రూ.1.50 లక్షలకు పెంచామన్నారు. పంట రుణాల బడ్జెట్‌ను రూ.100 కోట్లకు తెచ్చామన్నారు. నేషనల్ లైవ్ స్టాక్ మిషన్, గ్రామీణ ప్రాంతాల్లో గృహ రుణాలు, సొసైటీలకు గోడౌన్ల నిర్మాణం కోసం రుణాలు ఇస్తున్నామన్నారు. బ్యాంకు అభివృద్ధికి సహకరిస్తున్న పాలకవర్గం, సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో డైరెక్టర్లు పాశం సంపత్‌రెడ్డి, కొండా సైదయ్య, ఇరిగినేని అంజయ్య, గుడిపాటి సైదయ్య, దనావత్ జయరాం, బంటు శ్రీనివాస్, సుష్మ, కొమ్ము కరుణ, కె.వీరస్వామి, సీఈఓ శంకర్‌రావు, జీఎం నర్మద, డీజీఎంలు, ఏజీఎంలు సిబ్బంది పాల్గొన్నారు.
మతోన్మాద విధానాలపై పోరాడాలి
హాలియా : కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న మతోన్మాద విధానాలకు వ్యతిరేకంగా ప్రజలు పోరాటాలకు సిద్ధం కావాలని సీపీఎం జిల్లా కార్యదర్శి తుమ్మల వీరారెడ్డి పిలుపునిచ్చారు. సోమవారం హాలియా పట్టణంలో నిర్వహించిన సీపీఎం సాగర్ నియోజకవర్గస్థాయి రాజకీయ శిక్షణ తరగతుల్లో ఆయన మాట్లాడారు. దేశంలో అధికారంలో ఉన్న మోదీ ప్రభుత్వం కార్మిక, ప్రజా, రైతు వ్యతిరేక విధానాలను అవలంబిస్తోందన్నారు. నాలుగు లేబర్ కోడ్‌లను తీసుకువచ్చి కార్మికుల జీవితాలను నడిరోడ్డుకు తీసుకొచ్చిందన్నారు. రాష్ట్రంలోని రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీల అమలును అమలు చేయాలన్నారు. అనంతరం ‘మతం – మతతత్వం’ అనే క్లాసును పార్టీ సోషల్ మీడియా రాష్ట్ర కన్వీనర్ పిట్టల రవి, ‘పార్టీ నిర్మాణం, పని పద్ధతులు, శాఖల నిర్మాణం’ అనే క్లాసును సీపీఎం జిల్లా వర్గసభ్యుడు చిన్నపాక లక్ష్మినారాయణ బోధించారు. కార్యక్రమంలో కొండేటి శ్రీను, అవుతా సైదయ్య, దైద శ్రీను, కందుకూరి కోటేష్, రామచంద్రయ్య, జటావత్ రవినాయక్, కత్తి లింగారెడ్డి, బషీర్, సోమయ్య, కొప్పు వెంకన్న, వేములకొండ పుల్లయ్య, చంద్రశేఖర్, కారంపూడి ధనమ్మ, కోరె రమేష్, వెంకటేశ్వర్లు, యశోద, రాజమ్మ తదితరులు ఉన్నారు.
ఎస్‌ఎఫ్‌ఐ కేంద్ర కమిటీ సభ్యుడిగా ఖమ్మంపాటి శంకర్
నల్లగొండ: కేరళ రాష్ట్రం కోజికోడ్‌లో జరుగుతున్న ఎస్‌ఎఫ్‌ఐ 18వ మహాసభలకు కేంద్ర కమిటీ సభ్యుడిగా జిల్లాకు చెందిన ఖమ్మంపాటి శంకర్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా శంకర్ మాట్లాడుతూ జిల్లా నుంచి ఆలిండియా మహాసభలో కేంద్ర కమిటీ సభ్యుడిగా పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు.

అవార్డులకు దరఖాస్తుల ఆహ్వానం

అవార్డులకు దరఖాస్తుల ఆహ్వానం