సమస్యలపై ప్రశ్నించేది కమ్యూనిస్టులే..
చింతపల్లి : ప్రజా సమస్యలపై నిత్యం ప్రభుత్వాలను ప్రశ్నించేది కమ్యూనిస్టులేనని సీపీఐ జిల్లా కార్యదర్శి, ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం అన్నారు. సోమవారం చింతపల్లి మండల పరిధిలోని మాల్ వెంకటేశ్వర నగర్‌లో నిర్వహించిన సీపీఐ 14వ మండల మహాసభలో ఆయన మాట్లాడారు. మొదటి శత్రువు ముస్లింలు, రెండవ శత్రువు క్రైస్తవులు, మూడవ శత్రువు కమ్యూనిస్టులు అంటూ బీజేపీ నాయకులు మాట్లాడడం విడ్డురంగా ఉందన్నారు. రాష్టంలో గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం చేసిన అప్పులనుంచి బయటకు రావడం ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇబ్బందిగా మారిందన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు అనేక హామీలు ఇచ్చిందని వాటిని అమలు చేయాలన్నారు. ప్రభుత్వం నిష్పక్షపాతంగా పేదలకు సంక్షేమ పథకాలు అందించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో పార్టీ రాష్ట కార్యవర్గ సభ్యులు పల్లా నర్సింహారెడ్డి, మునుగోడు మాజీ ఎమ్మెల్యే ఉజ్జిని యాదగిరిరావు, పల్లా దేవేందర్‌రెడ్డి, అంజయ్యనాయక్, కలకొండ కాంతయ్య, ఉజ్జిని యుగేందర్‌రావు, పోలె వెంకటయ్య, ఉజ్జిని అంజల్‌రావు, చెల్లం పాండురంగారావు, కొలుకులపల్లి కొండలు తదితరులు పాల్గొన్నారు.
ఫ ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం


