
యాంత్రీకరణకు నిధులేవీ!
నల్లగొండ అగ్రికల్చర్ : గత ప్రభుత్వ హయాంలో (2018లో) నిలిచిపోయిన వ్యవసాయ యాంత్రీకరణ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం తిరిగి పునరుద్ధరిస్తామని అట్టహాసంగా ప్రకటించింది. రైతులకు సబ్సిడీపై వ్యవసాయ పరికరాలను అందిస్తామని చెప్పి 2024 సంవత్సరానికి గాను జిల్లాకు రూ.1.81 కోట్ల నిధులను కేటాయించింది. మార్చి 31వ తేదీలోగా రైతులకు యాంత్రీకరణ పరికరాలను గ్రౌండింగ్ చేయాలని ఉత్తర్వులు జారీ చేసింది. కానీ ఇప్పటి వరకు ఒక్క పైసా కూడా విడుదలు చేయకపోవడంతో ఈ పథకంపై నీలినీడలు కమ్ముకున్నాయి. ఈ పథకాన్ని గత ప్రభుత్వం మాదిరిగానే ఈ ప్రభుత్వం కూడా మూలన పెడుతుందా లేదా నిధులను విడుదల చేసి పునరుద్ధరిస్తుందా అనే అనుమానాలు రైతుల్లో వ్యక్తమవుతున్నాయి.
820 యూనిట్లు మంజూరు
రైతులకు అండగా నిలిచేందుకు ప్రభుత్వం వ్యవసాయ యాంత్రీకరణ పథకాన్ని తిరిగి ప్రారంభిస్తామని చెబుతూ జిల్లా వ్యాప్తంగా మొత్తం 820 యూనిట్లు మంజూరు చేసింది. కలెక్టర్ అనుమతిలో జిల్లా వ్యవసాయ శాఖ మండలాల వారీగా వ్యవసాయ పరికరాలను అలాట్ చేసింది. వాటిని కేటాయించేందుకు రైతుల నుంచి వ్యవసాయ శాఖ దరఖాస్తులు ఆహ్వానించింది. జిల్లా వ్యాప్తంగా వేలాది మంది రైతులు దరఖాస్తు చేసుకున్నారు. కానీ మార్చి దాటి మే నెల వస్తున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకానికి ఒక్కపైసా కూడా విడుదల చేయలేదు. సబ్సిడీ పరికరాల కోసం జిల్లా వ్యాప్తంగా రైతులు వ్యవసాయ శాఖ అధికారులను ఆరా తీసినా.. వారి దగ్గర ఎలాంటి సమాచారం లేదు. ఆరేడు సంవత్సరాలుగా యాంత్రీకరణ పథకం లేకపోవడం వల్ల రైతులే పూర్తిగా డబ్బులు వెచ్చింది ట్రాక్టర్లు, రోటవేటర్లు, కల్టివేటర్లు, స్స్రేయర్లు, ఇతర యాంత్రీకరణ పరికరాలను కొనుగోలు చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం యాంత్రీకరణను పునరుద్ధరిస్తామని ప్రకటించడంతో రైతులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తూ దరఖాస్తు చేసుకున్నారు. ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవడంతో రైతుల ఆశలపై నీళ్లు చల్లినట్లు అయ్యింది.
ఫ రూ.1.81 కోట్లు కేటాయించిన ప్రభుత్వం
ఫ మార్చి నెలాఖరుకు గ్రౌండింగ్ చేయాలని ఉత్తర్వులు
ఫ నిధులు రాకపోవడంతో గ్రౌండింగ్ చేయని వ్యవసాయ శాఖ
ఫ రైతుల ఆశలపై నీళ్లు చల్లిన ప్రభుత్వం
నిధులు విడుదల కాలేదు
వ్యవసాయ యాంత్రీకరణ పథకానికి సంబంధించిన నిధులను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయలేదు. పరికరాలు, నిధుల కేటాయింపు మాత్రమే చేసింది. రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేసిన వెంటనే పరికరాలను గ్రౌండింగ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం.
– పాల్వాయి శ్రవణ్‌కుమార్, డీఏఓ