
అక్రమంగా తరలిస్తున్న గోవుల పట్టివేత
భువనగిరిటౌన్: డీసీఎంలో అక్రమంగా తరలిస్తున్న గోవులను భువనగిరి పట్టణంలోని నల్లగొండ క్రాస్ రోడ్ వద్ద మంగళవారం పోలీసులు, బజరంగ్‌దళ్ నాయకులు పట్టుకున్నారు. ఏపీలోని కాకినాడ నుంచి డీసీఎంలో 16 గోవులను ఎక్కించి వాటి పైనుంచి కొబ్బరి పొట్టు కప్పి హైదరాబాద్‌లోని కబేళాకు తరలిస్తుండగా పట్టుకున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. ముగ్గురిపై కేసు నమోదు చేసినట్లు భువనగిరి పట్టణ ఎస్‌ఐ లక్ష్మీనారాయణ తెలిపారు. బక్రీద్ పండుగను దృష్టిలో పెట్టుకొని చెక్‌పోస్ట్‌లు ఏర్పాటు చేయాలని, గోరక్ష చట్టాన్ని కఠినంగా అమలు చేయాలని బజరంగ్‌దళ్ భువనగిరి పట్టణ కన్వీనర్ నెమల నవీన్ కోరారు.
సాంకేతిక కోర్సుల్లో ఉచిత శిక్షణ
భూదాన్‌పోచంపల్లి: యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్‌పోచంపల్లి మండలం జలాల్‌పురంలో గల స్వామి రామానందతీర్థ గ్రామీణ సంస్థలో మేథా చారిటబుల్ ట్రస్ట్ సహకారంతో 6 నెలల కాలవ్యవధి కల్గిన ఉపాధి ఆధారిత సాంకేతిక కోర్సులలో ఉచిత శిక్షణ ఇస్తున్నట్లు సంస్థ డైరెక్టర్ పీఎస్‌ఎస్‌ఆర్ లక్ష్మి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎలక్ట్రీషియన్ (డొమెస్టిక్), సోలార్‌సిస్టమ్ ఇన్‌స్టాలేషన్ అండ్ సర్వీస్ కోర్సుకు ఐటీఐ లేదా ఏదేని డిప్లమా పాసై ఉండాలని అన్నారు. కంప్యూటర్ హార్డ్‌వేర్, సెల్‌ఫోన్, ఎలక్ట్రానిక్ వస్తువుల రిపేర్ అండ్ సీసీ టీవీ టెక్నిషియన్ కోర్సుకు పదవ తరగతి విద్యార్హత కల్గి ఉండాలని అన్నారు. అలాగే టైలరింగ్ ఎంబ్రాయిడరీ, జర్ధోజీ క్విల్ట్ బ్యాగుల తయారీ కోర్సుకు మాత్రం 8వ తరగతి పాసైన వారు అర్హులని తెలిపారు. శిక్షణ కాలంలో ఉచిత భోజనంతో కూడిన హాస్టల్ వసతి కూడా కల్పించబడుతుందని అన్నారు. అంతేకాక శిక్షణ పూర్తి చేసుకొన్న అభ్యర్థులు తప్పనిసరిగా ఉద్యోగం కల్పిస్తామని చెప్పారు. అయితే అభ్యర్థులు 18 నుంచి 25 సంవత్సరాల మధ్య మయస్సు కల్గి ఉండాలని పేర్కొన్నారు. ఆసక్తి కల్గిన అభ్యర్థులు తమ విద్యార్హతల సర్టిఫికేట్లు, ఆధార్‌కార్డు, ఆదాయ ధృవీకరణ పత్రం, పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోలతో ఈ నెల 16న సంస్థలో నిర్వహించే కౌన్సిలింగ్‌కు నేరుగా హాజరు కావలెయునని తెలిపారు. ఇతర వివరాలకు 9133908000, 9133908111 నెంబర్లను సంప్రదించాలని సూచించారు.
స్వర్ణగిరి క్షేత్రంలో వైభవంగా నిత్య కల్యాణం
భువనగిరి: భువనగిరి పట్టణంలోని స్వర్ణగిరి క్షేత్రంలో పద్మావతి గోదాదేవి సమేత శ్రీవేంకటేశ్వరస్వామి నిత్య కల్యాణ మహోత్సవాన్ని మంగళవారం వైభవంగా నిర్వహించారు. అంతకుముందు ఆలయంలో స్వామివారికి సుప్రభాత సేవ, తోమాల సేవ, సహస్రనామార్చన నిర్వహించారు. మధ్యాహ్నం భక్తులకు అన్నప్రసాద వితరణ, సాయంత్రం తిరువీధి ఉత్సవ సేవ, దీపాలంకరణ నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ అర్చకులు, భక్తులు పాల్గొన్నారు.