
జిల్లాలో కొత్తగా 8,750 ఆహారభద్రత కార్డులు మంజూరు
నల్లగొండ : కొత్తగా రేషన్ కార్డులు పొందిన వారికి ఈ నెల నుంచే బియ్యం అందనున్నాయి. జిల్లాలో కొత్తగా 8,750 ఆహార భద్రత కార్డులు మంజూరు చేసింది. ఇప్పటికే ఉన్న కార్డుల్లో పిల్లలను చేర్చేందుకు గతంలో మీసేవ కేంద్రాల ద్వారా దరఖాస్తు చేసుకుని డీఎస్‌ఓ పెండింగ్ అని చూపించిన వాటిని కూడా ఓకే చేసింది. దీంతో కొత్తగా 61,247 మంది లబ్ధిదారులు పెరిగారు. కొత్త లబ్ధిదారులకు ఈ నెల రేషన్ కోటా కింద 3674.82 క్వింటాళ్ల సన్న బియ్యం విడుదల చేసింది. ఇదిలా ఉండగా.. రేషన్ కార్డుల కోసం సుమారు లక్ష వరకు దరఖాస్తులురాగా.. కేవలం 8,750 మందికి మాత్రమే ప్రస్తుతం కార్డులు వచ్చాయి. దీంతో మిగతా దరఖాస్తుదారులు తమకు రేషన్ కార్డు వస్తుందో.. రాదోనని ఆందోళన చెందుతున్నారు.
మిగతా వారికి ఎప్పుడో?
కొత్త రేషన్ కార్డుల కోసం జిల్లావ్యాప్తంగా వేల సంఖ్యలో దరఖాస్తు చేసుకుంటే ప్రస్తుతం బీసీ కులగణనలో వచ్చిన దరఖాస్తులను పరిశీలించి అర్హులను ఎంపిక చేసి కొద్దిమందికే ఇవ్వడంతో మిగిలిన వారికి ఎదురుచూపులు తప్పడం లేదు. అయితే మిగిలిన దరఖాస్తులు పరిశీలించి ఎప్పుడు కార్డులు ఇచ్చి బియ్యం కోటా కేటాయిస్తారో, అలాగే పిల్లల పేర్లు ఎక్కించేందుకు దరఖాస్తు చేసుకున్న వారిలోనూ అయోమయ పరిస్థితి నెలకొంది.
ఎన్నికల హామీ మేరకు..
2023 డిసెంబర్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నికల హామీ మేరకు అర్హులకు కొత్త రేషన్ కార్డులు ఇస్తామని ప్రకటించింది. అందులో భాగంగా ప్రజాపాలనతోపాటు ఆన్‌లైన్‌లో కూడా దరఖాస్తులు స్వీకరించింది. ప్రజా పాలనలో 50 వేల మంది పైచిలుకు రేషన్‌కార్డుల కోసం దరఖాస్తు చేసుకోగా మరికొందరు పిల్లల పేర్లు కార్డులో ఎక్కించేందుకు కూడా చాలా మంది దరఖాస్తులు చేశారు. ఆ తర్వాత బీసీ కులగణన సందర్భంలో 30 వేల వరకు దరఖాస్తు చేసుకున్నారు. ఆన్‌లైన్‌లో కూడా దరఖాస్తులకు అవకాశం ఇవ్వడంతో దాదాపు 19వేల వరకు దరఖాస్తులు వచ్చాయి.
కులగణన సమయంలో వచ్చిన దరఖాస్తుల సర్వే..
రేషన్ కార్డుల కోసం పెద్ద ఎత్తున దరఖాస్తులు వచ్చినప్పటికీ బీసీ కులగణన సందర్భంలో వచ్చిన దరఖాస్తుల ఆధారంగా ప్రభుత్వం సర్వే చేసినట్లు తెలిసింది. దీంతో జిల్లాలో కేవలం 8,750 కొత్త దరఖాస్తుదారులకు ఫుడ్ సెక్యూరిటీ కార్డులు మంజూరు చేశారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాం నుంచి రేషన్‌కార్డుల కోసం అర్హులు ఎదురుచూశారు. ఇప్పుడు కొందరికే మంజూరు చేయడంపై పలువురు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.
యాడ్ అయిన 61,247 యూనిట్లు
వారికి ఈ నెల నుంచే బియ్యం పంపిణీ
సుమారు లక్ష దరఖాస్తులు.. కొందరికే కార్డులిచ్చిన ప్రభుత్వం
అర్హులకు తప్పని ఎదురుచూపులు జిల్లాలో రేషన్ కార్డుల వివరాలు..
కొత్తగా వచ్చిన కార్డులు 8,750
యాడ్ అయిన యూనిట్లు 61,247
వీరికి కేటాయించిన బియ్యం 3674.82 (క్వింటాళ్లు)
గతంలో ఉన్న కార్డులు 4,66,061
గతంలో ఉన్న యూనిట్లు 13,85,506
కేటాయించిన బియ్యం 8,877.999
(మెట్రిక్ టన్నులు)
దరఖాస్తులు పరిశీలిస్తాం
కొత్త కార్డులకు ఈ నెల నుంచే సన్న బియ్యం కోటా కేటాయించాం. ప్రభుత్వ ఆదేశాల మేరకు మిగతా దరఖాస్తులు పరిశీలించి కార్డులు అందజేస్తాం. ఆ తర్వాత వారికి కూడా బియ్యం పంపిణీ చేస్తాం.
– వెంకటేశ్వర్లు, డీఎస్‌ఓ, నల్లగొండ