‘హస్తం’లో సంస్థాగతం
గ్రామ, మండల, బ్లాక్, జిల్లా పార్టీ అధ్యక్షుల ఎంపికకు కాంగ్రెస్ కసరత్తు
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: సంస్థాగత ఎన్నికల నిర్వహణకు కాంగ్రెస్ పార్టీ శ్రీకారం చుట్టింది. అందులో భాగంగా ఇప్పటికే సమన్వయకర్తలను టీపీసీసీ నియమించింది. గ్రామ, మండల, బ్లాక్, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుల నియామకం కోసం పార్టీ సమావేశాలు జరుగుతున్నాయి. జిల్లా స్థాయి ముఖ్యకార్యకర్తల సమావేశాలు ఏప్రిల్ 25 నుంచి 30వ తేదీ వరకు జరిగాయి. ఇందులో బ్లాక్ అధ్యక్షుల ఎంపికపై సమన్వయకర్తలు పార్టీ నేతలతో చర్చించారు. ఇక అసెంబ్లీ నియోజకవర్గ స్థాయి నాయకుల సమావేశాలను ఈ నెల 4 నుంచి 10వ తేదీ వరకు నిర్వహించనున్నారు. మండల కాంగ్రెస్ అధ్యక్ష పదవి ఆశిస్తున్న వారి పేర్లపై ఆ సమావేశాల్లో చర్చిస్తారు. ఆ తర్వాత 13వ తేదీ నుంచి 20వ తేదీ వరకు మండల స్థాయి నాయకుల సమావేశాలను నిర్వహించి గ్రామ కాంగ్రెస్ అధ్యక్ష పదవి ఆశిస్తున్న వారి పేర్లపై చర్చిస్తారు. జిల్లా, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్ష పదవి కోసం ముగ్గురి పేర్లను, మండల కాంగ్రెస్ అధ్యక్ష పదవికి ఐదుగురి పేర్లను పార్టీ అధిష్ఠానానికి ప్రతిపాదించనున్నారు. అయితే, గ్రామ పార్టీ అధ్యక్షులను మాత్రం ఏకగ్రీవంగా ఎన్నుకునేలా చర్యలు చేపట్టనున్నారు.
రెండు జిల్లాల్లో ఆశావహులు ఎక్కువే..
నల్లగొండ, సూర్యాపేట జిల్లాలో డీసీసీ అధ్యక్ష పదవి ఆశిస్తున్న నేతల్లో ఎక్కువే ఉన్నారు. ప్రస్తుత నల్లగొండ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు గుమ్మల మోహన్‌రెడ్డి, రాష్ట్ర నేతలు కొండేటి మల్లయ్య, పున్నా కై లాస్‌నేత, చనగాని దయాకర్ పేర్లు పదవి ఆశిస్తున్న వారి జాబితాలో ప్రధానంగా ఉన్నాయి. ఈ నలుగురు నేతల అనుచరులు మాత్రం తమ నాయకుడికే పదవి ఇవ్వాలని ఎవరికివారు కోరుతున్నారు. మరోవైపు.. పార్టీలు మారిన వారికి పార్టీ అధ్యక్ష పదవి ఇవ్వొద్దని కార్యకర్తల నుంచి డిమాండ్ వస్తోంది.
సూర్యాపేట జిల్లాలోనూ అధ్యక్ష పదవి కోసం ఐదుగురు నేతలు పోటీపడుతున్నారు. జిల్లాలో సీనియర్ నేతలతో పాటు రాష్ట్రస్థాయి పదవులు కలిగిన నేతలు కూడా అధ్యక్ష పదవి ఆశిస్తున్నారు. అందులో చకిలం రాజేశ్వర్‌రావు, తండు శ్రీనివాస్ యాదవ్, అన్నెపర్తి జ్ఞానసుందర్, ప్రస్తుత అధ్యక్షుడు చెవిటి వెంకన్నయాదవ్ ఉండగా.. టూరిజం కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్‌రెడ్డి కూడా డీసీసీ అధ్యక్ష పదవి ఆశిస్తున్నట్లు తెలిసింది.
డీసీసీ పీఠం ఎవరికో...
ఉమ్మడి జిల్లాలోని సూర్యాపేట, నల్లగొండ జిల్లాల్లో ఈసారి జిల్లా అధ్యక్ష పదవికి గట్టి పోటీ నెలకొంది. నల్లగొండ జిల్లాలో జిల్లా కాంగ్రెస్ ప్రస్తుత అధ్యక్షుడు శంకర్‌నాయక్ ఇటీవల ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. దీంతో జిల్లా పార్టీ అధ్యక్షుడి ఎన్నిక అనివార్యమైంది. ఈ నేపథ్యంలో.. పీసీసీ నియమించిన ఇద్దరు సమన్వయకర్తలైన మక్తల్ ఎమ్మెల్యే శ్రీహరి, మరో నేత నజీర్ అహ్మద్, సూర్యాపేట జిల్లా సమన్వయకర్త ఎమ్మెల్యే మురళినాయక్ ఇటీవల జిల్లాల్లో సమావేశాలు నిర్వహించారు. డీసీసీ అధ్యక్ష పదవి ఆశిస్తున్న వారి గురించి పూర్తి వివరాలు సేకరించారు. ఆ జాబితాను టీపీసీసీకి పంపించనున్నారు.
ఫ ఇప్పటికే సమన్వయకర్తలను
నియమించిన టీపీసీసీ
ఫ వారి ఆధ్వర్యంలోనే జిల్లా స్థాయి సమావేశాల నిర్వహణ
ఫ డీసీసీ అధ్యక్ష పదవికి ముగ్గురి పేర్లు ప్రతిపాదన
ఫ పోటీలో పలువురు రాష్ట్ర, జిల్లా స్థాయి నేతలు
ఫ 20వ తేదీ వరకు పూర్తికానున్న
సంస్థాగత ఎన్నికల ప్రక్రియ


