
రామన్నపేటలో పత్తిని కొనుగోలు చేస్తున్న వ్యాపారులు
అప్పులు మీదపడ్డాయి
20 ఎకరాలు కౌలుకు తీసుకొని పత్తిని సాగు చేశాను.రూ.8.50 లక్షలు పెట్టుబడి పెట్టాను. వర్షాలు లేకపోవడం, తెగుళ్లు సోకడంతో దిగుబడి పడిపోయింది. మొత్తం 45 క్వింటాళ్లు మాత్రమే వెళ్లింది. మరో 20 క్వింటాళ్ల దిగుబడి వచ్చే అవకాశం ఉన్నది. రూ.4లక్షల వరకు అప్పులు మీద పడే అవకాశం ఉంది.
– ఆవనగంటి లింగస్వామి, కౌలు రైతు
●
రామన్నపేట : వరుసగా రెండు సంవత్సరాల నుంచి నష్టాలను చవిచూస్తునపత్తి రైతు... ఈ ఏడూ నిండా మునిగాడు. వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోవడంతో చేలు ఎదగక పూర్తిగా దిగుబడి కోల్పోయాడు. ఎకరానికి 3 క్వింటాళ్లకు మించి దిగుబడి రాలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఇస్తున్న మద్దతు ధర ఏమాత్రం గిట్టుబాటు కావడం లేదంటున్నారు.
యాదాద్రి జిల్లాలో 1,02,777 ఎకరాల్లో సాగు
యాదాద్రి భువనగిరి జిల్లాలో 1,02,777 ఎకరాల్లో రైతులు పత్తి సాగు చేశారు. వాతావరణం అనుకూలిస్తే 5.13 లక్షల క్వింటాళ్ల దిగుబడి వచ్చేదని అధికారులు భావించారు. పెట్టుబడి నిమిత్తం ఎకరాకు రూ.35వేల వరకు రైతులు ఖర్చు చేశారు. పత్తి తీయడానికి క్వింటాకు వెయ్యి రూపాయలు ఖర్చు చేశారు. అయితే అనువైన సమయంలో వర్షాలు కురువకపోవడం, మరోవైపు తెగుళ్ల ఆశించడంతో దిగుబడి పూర్తిగా పడిపోయింది. పత్తి కొనుగోలు చేయడానికి సీసీఐ భువనగిరి, ఆలేరు, చౌటుప్పల్, వలిగొండ వ్యవసాయ మార్కెట్‌ల పరిధిలోని 14 జిన్నింగ్ మిల్లులను కేటాయించింది. కానీ, మూడు కేంద్రాల్లోనే పత్తి కొనుగోలు చేస్తున్నారు. ప్రభుత్వం ప్రకటించిన క్వింటాకు రూ.7,020 మద్దతు ధర ప్రకటించింది. ప్రైవేట్ వ్యాపారులు ఇంటి వద్దకు వచ్చి రూ.7,000 వేలకు కొనుగోలు చేస్తున్నారు. జిన్నింగ్ మిల్లులకు తరలించాలంటే రవాణా చార్జీలు అదనంగా మీద పడుతుండడంతో రైతులు ప్రైవేట్ వ్యాపారులకు అమ్ముకుంటున్నారు. ఆశించిన స్థాయిలో దిగుబడి రాక ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర సరిపోక రైతులు నష్టాలను చవిచూడవలసి వస్తుంది. మద్దతు ధర క్వింటాకు రూ.10వేలు ప్రకటించాలని కోరుతున్నారు.
పత్తి రైతుకు కలిసిరాని కాలం
వర్షాలు లేక తగ్గిన దిగుబడి
ఎకరానికి 3 క్వింటాళ్లకు మించలే..
గిట్టుబాటు కాని ధర
మద్దతు ధర రూ.10వేలు చేయాలి
ఏటేటా ఖర్చులు పెరుగుతున్నాయి. పెరిగిన సాగు ఖర్చులకు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం మద్దతు ధర పెంచడం లేదు. నాలుగైదు సంవత్సరాలుగా కాలం అనుకూలించకగా దిగుబడి రావడం లేదు. ఇటువంటి పరిస్థితుల్లో మద్దతు ధర పెంచాలి. క్వింటా రూ.10 వేలకు కొనుగోలు చేయాలి.
– బొక్క మాధవరెడ్డి, రైతు సమన్వయ
సమితి మండల అధ్యక్షుడు, రామన్నపేట

