
సాక్షి ప్రతినిధి, నల్లగొండ : అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థుల భవితవ్యం ఆదివారం తేలనుంది. అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ నవంబరు 30న జరిగిన విషయం తెలిసిందే. కౌంటింగ్ ప్రక్రియ ఆదివారం ఉదయం 8 గంటలకు ప్రారంభం కావడంతో అభ్యర్థుల్లో ఎడతెగని ఉత్కంఠత నెలకొంది. అయితే బీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీల మధ్య హోరాహోరిగా ఎన్నికల పోరు సాగింది. అయితే, ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ వేవ్ కొనసాగిందని ఎగ్జిట్ పోల్స్ తేల్చాయి. ఈ నేపథ్యంలో ఎవరు విజయం సాధిస్తారని జిల్లా ప్రజలు ఎదురుచూస్తున్నారు.
గెలుపుపై ఎవరి ధీమా వారిదే..
నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ పూర్తయిన నాటి నుంచి అన్ని పార్టీలు జోరుగా ప్రచారం చేపట్టాయి. కాంగ్రెస్ అభ్యర్థులు కూడా పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించి ఓటర్లను తమవైపు తిప్పుకునేందుకు అన్ని ప్రయత్నాలు చేశారు. కాంగ్రెస్ గతంలో చేపట్టిన పథకాలు, ప్రస్తుత ఎన్నికల్లో గెలిస్తే ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామని చెప్పుకున్నారు. బీఆర్‌ఎస్ అభ్యర్థులు మాత్రం పింఛన్లు, రైతుబంధు, రైతు బీమా, కల్యాణలక్ష్మి తదితర సంక్షేమ పథకాలను ప్రచారం చేస్తూనే గెలిస్తే.. పథకాల ద్వారా సాయాన్ని మరింత పెంచుతామని చెప్తూ వచ్చారు. ఈ ఎన్నికల్లో పథకాల లబ్ధిదారులు తమవైపే ఉన్నారంటూ బీఆర్‌ఎస్ అభ్యర్థులు.. ప్రభుత్వ వ్యతిరేకత, ఆరు గ్యారెంటీలే తమను గెలిపిస్తాని కాంగ్రెస్ అభ్యర్థులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
ప్రచార సభలకు అగ్రనేతలు..
గెలుపే లక్ష్యంగా సాగిన ప్రచారాలకు ఆయా పార్టీల అగ్రనేతలు హాజరయ్యారు. కాంగ్రెస్ తనఫున రాహుల్‌గాంధీ, ప్రియాంక గాంధీ, మల్లిఖార్జున ఖర్గే, రేవంత్‌రెడ్డి ప్రచారం చేశారు. బీఆర్‌ఎస్ తరఫున అభ్యర్థుల గెలుపు కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ అన్ని నియోజకవర్గాల్లో ప్రజాశీర్వాద సభల్లో పాల్గొన్నారు. కేటీఆర్ రోడ్ షోలు నిర్వహించారు. బీజేపీ అభ్యర్థుల గెలుపు కోసం జాతీయ నేతలు అమిత్‌షా, నడ్డా ప్రచారంలో పాల్గొన్నారు. అయితే, ఆయా పార్టీల సభలకు జనాలైతే భారీగా తరలివచ్చారు. దీంతో గెలుపు ఎవరిని వరిస్తుందోననే ఆసక్తి నెలకొంది.
ప్రతి నియోజకవర్గానికి 14 టేబుళ్లు
అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కౌంటింగ్ ప్రక్రియ ఆదివారం ఉదయం 8 గంటలకు మొదలు కానుంది. నల్లగొండ సమీపంలోని దుప్పలపల్లిలోని గోదాముల్లో కౌంటింగ్‌కు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. మొదట బ్యాలెట్ ఓట్లు, సర్వీస్ ఓట్లను లెక్కిస్తారు. ఆ తర్వాత ఈవీఎంల ఓట్లను లెక్కించడం ప్రారంభిస్తారు. ఈవీఎంల ఓట్ల లెక్కింపు కోసం ఒక్కో నియోజకవర్గానికి 14 టేబుళ్లను ఏర్పాటు చేశారు. ఒక్కో టేబుల్ మీదకు ఒక పోలింగ్ స్టేషన్‌కు సంబందించిన ఈవీఎం ఓట్లను ఉంచి ఒకేసారి 14 పోలింగ్‌స్టేషన్ల ఓట్లను లెక్కిస్తారు. దాన్ని ఒక రౌండ్‌గా పిలుస్తారు. ఇలా ఆయా నియోజకవర్గాల్లో ఉన్న పోలింగ్ స్టేషన్లను బట్టి రౌండ్ల వారీగా ఓట్లను లెక్కిస్తారు.
ఫ ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు
ఫ మధ్యాహ్నం 2 గంటలకు తొలి ఫలితం
ఫ అభ్యర్థులు ఎక్కువగా ఉన్న చోట
కౌంటింగ్‌కు మరింత సమయం
ఫ ప్రధాన పోటీ బీఆర్‌ఎస్, కాంగ్రెస్ మధ్యనే..
ఫ అభ్యర్థుల్లో ఎడతెగని ఉత్కంఠ
ఫ ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రజలు
నియోజకవర్గం పోలింగ్ స్టేషన్లు అభ్యర్థులు
మునుగోడు 307 39
దేవరకొండ 310 13
మిర్యాలగూడ 263 23
నకిరేకల్ 305 23
నాగార్జునసాగర్ 299 15
నల్లగొండ 284 31

కౌంటింగ్ కేంద్రాన్ని పరిశీలిస్తున్న కలెక్టర్ కర్ణన్, ఎస్పీ అపూర్వరావు