నేడు హాలియాకు సీఎం రాక | Sakshi
Sakshi News home page

నేడు హాలియాకు సీఎం రాక

Published Tue, Nov 14 2023 1:52 AM

హాలియా పట్టణ శివారులోని దేవరకొండ రోడ్డులో సిద్ధమైన సభావేదిక   - Sakshi

హాలియా: అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి గులాబీ పార్టీ దళపతి, సీఎం కేసీఆర్‌ మంగళవారం నాగార్జున సాగర్‌ నియోజకవర్గానికి రానున్నారు. హాలియాలోని అనుముల వద్ద దేవరకొండ రోడ్డు పక్కన 18 ఎకరాల మైదానంలో మధ్యాహ్నం 3 గంటలకు నిర్వహించే ప్రజా ఆశీర్వాద సభలో సీఎం పాల్గొని ప్రసంగించనున్నారు. ఈ మేరకు సాగర్‌ బీఆర్‌ఎస్‌ నాయకత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. సీఎం సభను సవాల్‌గా తీసుకున్న బీఆర్‌ఎస్‌ నాయకత్వం భారీ జన సమీకరణపై ప్రత్యేక దృష్టి పెట్టింది. సీఎం సభకు కావాల్సిన వేదిక పనులను దగ్గర ఉండి పర్యవేక్షించింది. సభా వేదికపై సీఎం కేసీఆర్‌తో పాటు మంత్రులు, ఎమ్మెల్సీలు, బీఆర్‌ఎస్‌ ముఖ్య నేతలు కూర్చునేలా, వేదిక ముందు వీఐపీలు, మీడియాకు ప్రత్యేక గ్యాలరీలు ఏర్పాటు చేయడంతోపాటు సభకు తరలివచ్చే జనం కోసం ప్రత్యేక వసతులు కల్పించారు. సభావేదికకు సమీపంలో హెలికాప్టర్‌ ల్యాడింగ్‌ కోసం హెలిప్యాడ్‌ను సిద్ధం చేశారు. వాహనాల పార్కింగ్‌కు హాలియా శివారు ప్రాంతాలైన మిర్యాలగూడ, దేవరకొండ, సాగర్‌ రోడ్ల వెంట ఖాళీ మైదానాలు కేటాయించారు. శివారు ప్రాంతాలు, పట్టణంలో చెక్‌పోస్టులు పెట్టారు. పోలీస్‌ శాఖ కూడా బందోబస్తుకు ప్రత్యేక పోలీసులను నియమించింది.

లక్షమంది జన సమీకరణ..

సీఎం కేసీఆర్‌ బహిరంగ సభకు నాగార్జున సాగర్‌ నియోజకవర్గ వ్యాప్తంగా సుమారు లక్ష మంది జనాన్ని తరలించేందుకు బీఆర్‌ఎస్‌ నేతలు లక్ష్యంగా పెట్టుకున్నారు. నియోజకవర్గంలోని ఆరు మండలాల నుంచి జనాన్ని సమీకరించేందుకు పార్టీ నాయకత్వం దృష్టి సారించింది. ఇప్పటికే జన సమీకరణకు ఆయా మండల, పార్టీ ముఖ్య నాయకులతో బీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి నోముల భగత్‌, ఎన్నికల ఇన్‌చార్జీలు ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి, ట్రైకార్‌ చైర్మన్‌ ఇస్లావత్‌ రాంచందర్‌నాయక్‌, జెడ్పీ వైస్‌ చైర్మన్‌ ఇరిగి పెద్దులు, రాష్ట్ర ఆప్కాబ్‌ మాజీ చైర్మన్‌ యడవెల్లి విజయేందర్‌రెడ్డి సమీక్షలు జరిపారు. భారీగా జనాన్ని తరలించేందుకు ముమ్మర కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది.

ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొననున్న కేసీఆర్‌

ఫ భారీ జన సమీకరణకు బీఆర్‌ఎస్‌ సన్నాహాలు

ఫ ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్‌ కర్ణన్‌, ఎస్పీ అపూర్వరావు, నాయకులు

సభ ఏర్పాట్లు పరిశీలించిన నేతలు, అధికారులు

హాలియాలో మంగళవారం జరిగే సీఎం కేసీఆర్‌ బహిరంగ సభ ఏర్పాట్లను రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్‌, బీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థి నోముల భగత్‌, ఎన్నికల ఇన్‌చార్జ్‌లు ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి, ట్రైకార్‌ చైర్మన్‌ రాంచందర్‌నాయక్‌లు సోమవారం జెడ్పీ వైస్‌ చైర్మన్‌ ఇరిగి పెద్దులు, ఆప్కాబ్‌ మాజీ చైర్మన్‌ యడవెల్లి విజేందర్‌రెడ్డితో కలిసి పరిశీలించారు. అదేవిధంగా జిల్లా కలెక్టర్‌ కర్ణన్‌, ఎస్పీ అపూర్వరావు కూడా సీఎం సభ ఏర్పాట్లు, హెలిప్యాడ్‌ స్థలాన్ని పరిశీలించారు.

Advertisement
Advertisement