
శృతికి కౌన్సిలింగ్ ఇస్తున్న పోలీసులు
నల్గొండ: భర్త ఇంటి ఎదుట భార్య బైఠాయించిన ఘటన నార్కట్‌పల్లి మండలంలోని కొండపాకగూడెం గ్రామంలో సోమవారం చోటు చేసుకుంది. గ్రామస్తులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నల్లగొండ మండలం దోమలపల్లి గ్రామానికి చెందిన శృతికి నార్కట్‌పల్లి మండలం కొండపాకగూడెం గ్రామానికి చెందిన జీడిమడ్ల రవీందర్‌రెడ్డితో 2022 ఫిబ్రవరిలో వివాహం జరిగింది. వివాహ సమయంలో శృతి కుటుంబ సభ్యులు ముందుగా అనుకున్న ప్రకారం కట్నకానుకలు ఇచ్చారు. వివాహమైన కొన్ని నెలల వరకు వీరి దాంపత్య జీవితం సజావుగా సాగింది.
కాగా 5 నెలల క్రితం తన భర్త అదనపు కట్నం కావాలని వేధిస్తున్నాడంటూ శృతి తల్లిగారి ఇంటికి వెళ్లింది. దీనిపై నల్లగొండ మహిళా పోలీస్ స్టేషన్‌లో కేసు కొనసాగుతోంది. కాగా సోమవారం మహిళా పోలీస్ స్టేషన్‌లో పంచాయితీ ఉండగా రవీందర్‌రెడ్డి కుటుంబ సభ్యులందరూ అక్కడకు వెళ్లారు. కానీ శృతి నేరుగా కొండపాకగూడెంలోని భర్త ఇంటి వద్దకు వచ్చి తన భర్త తనకు కావాలంటూ అతడి ఇంటి ఎదుట బైఠాయించింది. ఈ విషయం తెలుసుకున్న నార్కట్‌పల్లి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని శృతికి కౌన్సిలింగ్ ఇచ్చారు.