కల్వకుర్తి రూరల్: కళాకారులను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. పట్టణంలోని ఓ ఫంక్షన్‌హాల్‌లో ఆదివారం స్వర్ణ భారతి కళానిలయం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వేసవి శిక్షణ శిబిరం ముగింపు కార్యక్రమానికి ఆయన హాజరై మాట్లాడారు. స్వర్ణభారతి కళానిలయం నిర్వాహకులు 25 ఏళ్లుగా ఎలాంటి లాభాపేక్ష లేకుండా విద్యార్థులకు పలు విభాగాల్లో సంప్రదాయ నృత్య శిక్షణ అందించడం అభినందనీయమన్నారు. తమలోని కళలను వెలికి తీసుకునేందుకు కల్పిస్తున్న అవకాశాలను బాలబాలికలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అనంతరం శిక్షణ పూర్తిచేసుకున్న విద్యార్థులకు మెమోంటోలు అందజేశారు. ఈ సందర్భంగా నిర్వాహకుడు నారోజు మోహన్ ఎమ్మెల్యేతో పాటు అతిథులను శాలువాతో సత్కరించారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్‌చైర్మన్ షాన్‌వాజ్ ఖాన్, సురేందర్‌రెడ్డి, సంజీవ్ యాదవ్, వెంకటేశ్, సురేశ్, నవీన్ పాల్గొన్నారు.


