ఇచ్చింది రూ.267.23 కోట్లు.. రావాల్సింది రూ.159.65 కోట్లు..
ఆర్థిక ఇబ్బందులు..
● ఇప్పటి వరకు 2 ఎకరాలకే పరిమితం
● నీరుగారుతున్న రైతుభరోసా లక్ష్యం
● నిరాశలో అన్నదాతలు
నాకు నాలుగున్నరెకరాల వ్యవసాయ భూమి ఉంది. యాసంగికి సంబంధించి పెట్టుబడి సాయం కింద రూ. 27వేలు రావాల్సి ఉండగా.. ఇప్పటి వరకు కేవలం రెండెకరాల వరకే రూ. 12వేలు జమ అయ్యాయి. వానాకాలం సమీపిస్తున్నందున త్వరగా సాయాన్ని అందించాలి. వానాకాలంలో కూడా పెట్టుబడి సాయాన్ని సకాలంలో విడుదల చేయాలి.
– తిరుపతయ్య, రైతు, తిర్మలాపురం (బీకే), అమ్రాబాద్ మండలం
నాకు ఆరెకరాల వ్యవసాయ భూమి ఉంది. యాసంగికి సంబంధించి ఇప్పటి వరకు రూ. 12వేలు మాత్రమే వచ్చాయి. పెట్టుబడి సాయం పంటల సీజన్ ప్రారంభంలోనే చెల్లిస్తే ఎరువులు, ఇతర ఖర్చులకు ఉపయోగించుకోవచ్చు. ఆలస్యం కావడంతో అప్పులు చేయాల్సి వస్తుంది.
– జల్ల వెంకటయ్య, రైతు, మర్రిపల్లి, ఉప్పునుంతల మండలం
రైతులకు సాగు పెట్టుబడి సాయంపై ప్రభుత్వమే నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. అర్హులకు రైతుభరోసా అందిస్తుంది. ఎవరికై నా బ్యాంకు ఖాతాల వివరాల్లో పొరపాట్లు ఉంటే సరిచేసుకోవాలి. రాష్ట్రవ్యాప్తంగా రైతులందరికీ ఏకకాలంలో పెట్టుబడి సాయం విడుదల చేస్తారు.
– యశ్వంత్‌రావు, డీఏఓ
అచ్చంపేట: యాసంగి పంటల సీజన్ ముగింపు దశకు వచ్చినా.. ఇప్పటికీ పూర్తిస్థాయిలో రైతుభరోసా అందలేదు. రెండెకరాలలోపు రైతులకే పెట్టుబడి సాయం పరిమితమైంది. మిగిలిన రైతుల ఖాతాల్లో డబ్బులు ఎప్పుడు జమ చేస్తారన్న విషయమై ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పష్టత లేదు. మరోవైపు వర్షాకాలం ముంచుకొస్తోంది. పంటల సాగుకు రైతులు భూములను సిద్ధం చేసుకుంటున్నారు. పంటసాగు పెట్టుబడులకు ప్రభుత్వం నుంచి సాయం అందకపోవడంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు.
గతంలో పంట పెట్టుబడుల కోసం రైతులు వడ్డీ వ్యాపారులను ఆశ్రయించాల్సి వచ్చేది. రైతుభరోసా పథకం వచ్చాక రైతులకు అప్పులు చేయాల్సిన అవసరం కొంత తగ్గింది. అయితే ఈ పథకాన్ని అమలు చేయడంలో రెండేళ్లుగా జాప్యం జరుగుతోంది. దీంతో అన్నదాతలు మళ్లీ అప్పులు చేయాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయని పలువురు అవేదన వ్యక్తంచేస్తున్నారు. యాసంగి రైతుభరోసానే పూర్తి స్థాయిలో అందకపోవడంతో.. ఇక వచ్చే వానాకాలం పెట్టుబడి సాయం ఉంటుందో ఉండదో అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వం ఇప్పటికై నా స్పందించి పూర్తిస్థాయిలో రైతుభరోసా నిధులు విడుదల చేయాలని రైతులు కోరుతున్నారు.
అసంపూర్తిగా యాసంగి సాగు పెట్టుబడి సాయం
జిల్లాలో 3,18,960 మంది రైతులు ఉన్నారు.అందరికీ పెట్టుబడి సాయం అందించడానికి రూ.426.88 కోట్ల నిధులు అవసరం. సాధారణంగా యాసంగికి సంబంధించి రైతుభరోసా నిధులను డిసెంబర్, జనవరి నెలల్లో విడుదల చేస్తారు. కానీ ఈసారి మార్చి 22న మొదటి విడత రూ. 157.45 కోట్ల నిధులు విడుదల చేశారు. ఎకరం వరకు పెట్టుబడి సాయాన్ని అందరు రైతుల ఖాతాలలో జమ చేశారు. గత నెల 20న రెండో విడతలో రెండెకరాల లోపు రైతులకు రూ. 109.78 కోట్ల సాయం అందించారు. రెండు విడతల్లో కలిపి జిల్లాలోని రైతులకు రూ. 267.23 కోట్ల నిధులు మాత్రమే జమ అయ్యాయి. ఇంకా రూ. 159.65 కోట్ల నిధులు జమ కావాల్సి ఉంది. మిగతా నిధులు ఎప్పుడు విడదల చేస్తారనే విషయంపై ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పష్టత లేదు. అయితే గత వానాకాలంలో రైతులందరికీ పంట పెట్టుబడి సాయం అందింది. కానీ యాసంగికి వచ్చే సరికి పథకం అమలులో జాప్యం జరుగుతోంది.


