సమర్థవంతంగా ‘ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక’ | - | Sakshi
Sakshi News home page

సమర్థవంతంగా ‘ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక’

May 19 2026 2:10 AM | Updated on May 19 2026 2:10 AM

22న జరిగే జిల్లాస్థాయి సభను

విజయవంతం చేయాలి

కలెక్టర్‌ హేమంత కేశవ్‌ పాటిల్‌

కందనూలు: ప్రజాపాలన – ప్రగతి ప్రణాళికలో భాగంగా చేపట్టిన 99 రోజుల కార్యాచరణను సమర్థవంతంగా అమలు చేయడంలో అధికారులు కీలకపాత్ర పోషిస్తున్నారని కలెక్టర్‌ హేమంత కేశవ్‌ పాటిల్‌ అన్నారు. సోమవారం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో అదనపు కలెక్టర్లు అమరేందర్‌, దేవ సహాయంతో కలిసి జిల్లాస్థాయి ప్రజాపాలన సభ నిర్వహణపై అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. ఈ నెల 22న జిల్లాకేంద్రంలోని తేజ కన్వెన్షన్‌ హాల్‌లో ప్రజాపాలన జిల్లాస్థాయి సభ నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు. జిల్లా ప్రజలకు ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను మరింత చేరువ చేయడం.. ప్రజా సమస్యలను నేరుగా తెలుసుకొని పరిష్కార మార్గాలు చేపట్టడం ఈ సభ ప్రధాన ఉద్దేశమని తెలిపారు. జిల్లాలోని ఎంపీ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మున్సిపల్‌ చైర్మన్లు, కౌన్సిలర్లు, సర్పంచులు, ఇతర ప్రజాప్రతినిధులు సభకు హాజరయ్యేలా ఆహ్వానాలు అందించాలని అధికారులకు సూచించారు. అదే విధంగా అన్నిశాఖల జిల్లాస్థాయి, డివిజన్‌, మండలస్థాయి అధికారులు హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ పథకాలను జిల్లాస్థాయిలో ప్రజలకు పూర్తిస్థాయి అవగాహన కల్పించడం.. లబ్ధిదారుల హాజరు తదితర అంశాలపై కలెక్టర్‌ శాఖల వారీగా ఆదేశాలు జారీ చేశారు. సమావేశంలో జెడ్పీ డిప్యూటీ సీఈఓ గోపాల్‌ నాయక్‌, ఆర్డీఓ సురేశ్‌బాబు ఉన్నారు.

ఆధునిక జీవనశైలిలో క్రీడలు తప్పనిసరి..

ఆధునిక జీవనశైలిలో వ్యాయామం, క్రీడలు, యోగా వంటి వాటిని అలవర్చుకోవాల్సిన అవసరముందని కలెక్టర్‌ అన్నారు. జిల్లా యువజన, క్రీడలశాఖ ఆధ్వర్యంలో స్థానిక బాలుర ఉన్నత పాఠశాల మైదానం నుంచి నిర్వహించిన ‘ఫిట్‌ అండ్‌ యాక్టివ్‌ 2కే రన్‌’ కార్యక్రమాన్ని ఆయన జెండా ఊపి ప్రారంభించారు. మినీ ట్యాంక్‌బండ్‌ వరకు నిర్వహించిన 2కే రన్‌లో కలెక్టర్‌తో పాటు యువత, అధికారులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ప్రజల ఆరోగ్యం, యువత శక్తి, క్రీడా సంస్కృతికి అత్యధిక ప్రాధాన్యం ఇస్తోందన్నారు. విద్యార్థులు, యువత చెడు అలవాట్లకు దూరంగా ఉండి, క్రీడల్లో చురుకుగా పాల్గొనాలని పిలుపునిచ్చారు. క్రీడల ద్వారా క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం పెరుగుతాయన్నారు. కార్యక్రమంలో డీవైఎస్‌ఓ సీతారాం, అదనపు ఎస్పీ వెంకటేశ్వర్లు, మున్సిపల్‌ చైర్మన్‌ తీగల సునేంద్ర, ఆర్డీఓ సురేశ్‌బాబు పాల్గొన్నారు.

ప్రతి అధికారి హాజరుకావాలి..

కలెక్టరేట్‌లో నిర్వహించే ప్రజావాణికి జిల్లాస్థాయి అధికారులందరూ విధిగా హాజరు కావాలని కలెక్టర్‌ హేమంత కేశవ్‌ పాటిల్‌ ఆదేశించారు. కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణిలో అదనపు కలెక్టర్‌ అమరేందర్‌తో కలిసి ఆయన ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. తమ పిల్లలు ఆస్తులను తీసుకుని, తమను పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తంచేస్తూ, ప్రజావాణికి వచ్చిన వృద్ధుల వద్దకు స్వయంగా కలెక్టర్‌ వెళ్లి వినతిపత్రాలను స్వీకరించారు. వారికి ధైర్యం చెప్పి.. తగిన చర్యలు తీసుకుంటామని భరోసానిచ్చారు. ప్రజావాణికి 35 దరఖాస్తులు వచ్చాయని.. వీటికి సత్వర పరిష్కారం చూపాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో కలెక్టరేట్‌ ఏవో చంద్రశేఖర్‌ పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement