నాగర్‌కర్నూల్ రూరల్: జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ఎస్పీ సంగ్రామ్ సింగ్‌జీ పాటిల్ పాల్గొని ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. ఫిర్యాదుదారుల సమస్యలను నేరుగా తెలుసుకున్న ఆయన.. వాటిని చట్టప్రకారం పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. భూ తగాదాకు సంబంధించి 2, తగు న్యాయం చేయాలని 2, భార్యాభర్తల గొడవపై 1 ఫిర్యాదు అందినట్లు తెలిపారు. ప్రజలు మూడో వ్యక్తి ప్రమేయం లేకుండా నిర్భయంగా పోలీసు సేవలను వినియోగించుకోవాలని ఎస్పీ సూచించారు.
ఇంటర్ సప్లిమెంటరీకి 190మంది గైర్హాజరు
కందనూలు: జిల్లాలో ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. సోమవారం జిల్లావ్యాప్తంగా 18 కేంద్రాల్లో భౌతికశాస్త్రం, ఆర్థికశాస్త్రం పరీక్షలు నిర్వహించగా.. మొదటి సంవత్సరం విద్యార్థులు 2,111 మందికి గాను 1,963 మంది హాజరైయ్యారు. జనరల్ విభాగంలో 1,725 మందికి గాను 1,599 మంది, ఒకేషనల్ విభాగంలో 386 మందికి గాను 364 మంది హాజరై పరీక్ష రాశారు. ద్వితీయ సంవత్సరంలో 754 మందికి గాను 712 మంది హాజరైయ్యారు. జనరల్ విభాగంలో 571 మందికి గాను 534 మంది, ఒకేషనల్ విభాగంలో 712 మంది హాజరై పరీక్ష పరీక్ష రాశారు. జిల్లావ్యాప్తంగా మొదటి సంవత్సరంలో 148 మంది, ద్వితీయ సంవత్సరంలో 42 మంది గైర్హాజరయ్యారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా పరీక్ష కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లు చేశామని డీఐఈఓ వెంకటరమణ తెలిపారు.
మక్కలు కొనడంలేదని రైతన్న ఆగ్రహం
అచ్చంపేట రూరల్: మొక్కజొన్న ధాన్యాన్ని మార్కెట్‌కు తీసుకొచ్చి రోజులు గడుస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదని ఆగ్రహించిన రైతులు.. సోమవారం అచ్చంపేట వ్యవసాయ మార్కెట్‌యార్డు ప్రధాన గేటుకు తాళంవేసి ఆందోళనకు దిగారు. 20 రోజుల క్రితం వివిధ గ్రామాల నుంచి రైతులు మొక్కజొన్న ధాన్యాన్ని మార్కెట్‌యార్డులోని కొనుగోలు కేంద్రానికి తీసుకొచ్చారు. అయితే కొనుగోళ్లలో జాప్యం కారణంగా రైతులు ధాన్యం కుప్పల వద్దే కాపలా ఉంటున్నారు. వాతావరణంలో మార్పులు వచ్చినప్పుడల్లా ఆందోళన చెందుతున్నారు. ఇటీవల స్థానిక ఎమ్మెల్యే డా.చిక్కుడు వంశీకృష్ణ అధికారులతో సమీక్షించి.. మొక్కజొన్న కొనుగోళ్లలో ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చూడాలని సూచించినా అధికారులు పట్టించుకోవడం లేదని రైతులు ఆరోపించారు. మక్కలు కొనాలని అధికారులకు ఫోన్ చేసినా ఎత్తడం లేదని.. తమ సమస్య ఎవరికి చెబుకోవాలని ఆవేదన వ్యక్తంచేశారు. మార్కెట్‌కు తీసుకొచ్చిన మొక్కజొన్నను వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. రైతుల ఆందోళన సమాచారం అందుకున్న తహసీల్దార్ సైదులు మార్కెట్‌యార్డుకు చేరుకొని గేటుకు తాళం తీయించారు. సమస్యను పరిష్కరిస్తామని రైతులకు హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.
అంతరాలు లేని
సమాజ స్థాపనే లక్ష్యం
నాగర్‌కర్నూల్ రూరల్: అంతరాలు లేని సమసమాజ స్థాపనే తెలంగాణ ప్రజా నాట్యమండలి లక్ష్యమని రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాస్, సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు బాల్‌నర్సింహ అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని సీపీఐ కార్యాలయంలో నిర్వహించిన తెలంగాణ ప్రజా నాట్యమండలి జల్లా నాలుగో మహాసభలకు వారు హాజరై మాట్లాడారు. 1943లో పురుడు పోసుకున్న ప్రజా నాట్యమండలి.. దేశ స్వాంతంత్రోద్యమం నుంచి మొదలుకొని తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం, మలిదశ తెలంగాణ ఉద్యమంలో ముఖ్య భూమిక పోషించిందన్నారు. మూఢ నమ్మకాలు, వివక్షత, మతోన్మాదం, కులమతాలకు చరమగీతం పాడేందుకు ప్రతి ఒక్కరూ నడుం బిగించాలని పిలుపునిచ్చారు. ఈ నెల 25న హైదరాబాద్‌లో నిర్వహించే రాష్ట్ర మహాసభలకు అధిక సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు నర్సింహ, గోపాల్, ప్రేమ్‌కుమార్, సలేశ్వరం, చందు, యాదగిరి, రామస్వామి, లింగేశ్వర్, శ్రీనివాస్, సురేశ్, కుర్మయ్య పాల్గొన్నారు.


