దివ్యాంగుల సంక్షేమంపై ప్రత్యేక దృష్టి | - | Sakshi
Sakshi News home page

దివ్యాంగుల సంక్షేమంపై ప్రత్యేక దృష్టి

May 19 2026 2:10 AM | Updated on May 19 2026 2:10 AM

కందనూలు: దివ్యాంగుల సంక్షేమంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టిసారించినట్లు ఎమ్మెల్యే కూచుకుళ్ల రాజేశ్‌రెడ్డి అన్నారు. సోమవారం స్థానిక భవిత కేంద్రంలో జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో 81 మంది దివ్యాంగ విద్యార్థులకు 14 రకాల 108 ఉపకరణాలు, సహాయక కిట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దివ్యాంగులకు అన్నివిధాలుగా అండగా నిలవడం తమ బాధ్యత అని అన్నారు. విద్య, ఉపాధి, వైద్యం, పునరావాసం వంటి రంగాల్లో ప్రత్యేక పథకాల ద్వారా దివ్యాంగులకు ప్రోత్సాహం అందిస్తున్నామని చెప్పారు. దివ్యాంగ విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకొని ముందుకుసాగాలని సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లోని దివ్యాంగ పిల్లలకు కూడా మెరుగైన విద్య, అవసరమైన సహాయక ఉపకరణాలు అందించేందుకు కృషిచేస్తానని తెలిపారు. డీఈఓ రమేశ్‌కుమార్‌ మాట్లాడుతూ.. ప్రభుత్వం ‘‘నా విద్య’’ కార్యక్రమం ద్వారా దివ్యాంగ విద్యార్థులకు ప్రత్యేక సేవలు అందిస్తున్నట్లు తెలిపారు. విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు, ఫిజియోథెరపీ, ప్రత్యేక శిక్షణతో పాటు అవసరమైన సహాయక ఉపకరణాలను అందిస్తున్నామని చెప్పారు. ప్రతి దివ్యాంగ విద్యార్థి సాధారణ విద్యతో పాటు నైపుణ్యాలను అభివృద్ధి చేసుకునేలా చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్మన్‌ తీగల సునేంద్ర, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ రమణారావు, వెంకటేశ్వరశెట్టి పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement