కల్వకుర్తి రూరల్: గ్రామాల్లో శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణలో సీసీ కెమెరాలు కీలకపాత్ర వహిస్తాయని కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. శనివారం మండలంలోని తాండ్ర గ్రామంలో సర్పంచ్ ఆశాదీప్‌రెడ్డి తన సొంత నిధులు రూ.12.50 లక్షలతో ఏర్పాటు చేసిన 67 సీసీ కెమెరాలను గ్రామ పంచాయతీ కార్యాలయంలో కలెక్టర్ ప్రారంభించి మాట్లాడారు. నిఘా నీడలో గ్రామాల్లో ఎలాంటి గొడవలకు ఆస్కారం లేకుండా ఉంటాయన్నారు. నేరాలు సైతం తగ్గే విషయంలో సీసీ కెమెరాల పాత్ర ప్రధానంగా ఉంటుందన్నారు. ఒక్క సీసీ కెమెరా వందమంది భద్రతా సిబ్బందితో సమానమని, గ్రామ అభివృద్ధికి యువ సర్పంచ్ ఆశాదీప్‌రెడ్డి అందిస్తున్న సేవలను కలెక్టర్ కొనియాడారు. గ్రామంలో రూ.70 లక్షలతో చేపట్టిన అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ పనులను పరిశీలించి.. గ్రామంలో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలపై సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం రూ.5 కోట్లతో నిర్మిస్తున్న జిల్లా పరిషత్ పాఠశాల భవన పనులను పరిశీలించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చదువుకున్న పాఠశాల పనులను నాణ్యతగా, వేగంగా పూర్తిచేయాలన్నారు. రాబోయే విద్యా సంవత్సరం నాటికి పనులు పూర్తి చేసి పాఠశాలను ప్రారంభానికి సిద్ధం చేయాలని కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. అనంతరం గ్రామస్తులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ఆశాదీప్‌రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు విజయ్‌కుమార్‌రెడ్డి, సాయిరెడ్డి తహసీల్దార్ ఇబ్రహీం పాల్గొన్నారు.


