కొల్లాపూర్: పట్టణంలోని ప్రభుత్వ వసతి గృహాలు, వృద్ధాశ్రమాన్ని జూనియర్ సివిల్ జడ్జి కోర్టు న్యాయమూర్తులు దమ్ము ఉపనిషధ్వాణి, ఆర్.శరణ్య శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. బీసీ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు సెల్‌ఫోన్ వల్ల కలిగే లాభాలు, నష్టాల గురించి వివరించారు. జ్ఞానం పెంచుకోవడానికి ఇంటర్నెట్ సేవలను వినియోగించుకోవాలని, వ్యసనాలకు అవి కారణం కాకూడదన్నారు. నిర్ణీత వయస్సు లేనివారు వాహనాలు నడపవద్దని సూచించారు. పోక్సో చట్టాలపై అవగాహన కల్పించారు. ఎస్సీ, ఎస్టీ హాస్టళ్లను తనిఖీ చేసి నిర్వహణ తీరు పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. హాస్టల్ పరిశుభ్రంగా లేదని, వంటశాల నిర్వహణ బాగాలేదని వార్డెన్‌పై అసహనం వెలిబుచ్చారు. వెంటనే పరిశుభ్రత చర్యలు తీసుకోవాలని సూచించారు. వృద్ధాశ్రమంలో వృద్ధులతో మాట్లాడి ఆరోగ్యం గురించి ఆరాతీశారు.


