మధుమేహంతో అనేక దుష్ప్రభావాలు
నాగర్‌కర్నూల్ క్రైం: మధుమేహాన్ని అదుపులో ఉంచుకోకపోతే తీవ్ర అనారోగ్య సమస్యలు ఎదురవుతాయని డిప్యూటీ డీఎంహెచ్‌ఓ డా.వెంకటదాసు అన్నారు. ప్రపంచ మధుమేహ దినోత్సవాన్ని పురస్కరించుకొని శుక్రవారం మండలంలోని పెద్దముద్దునూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రోగులకు, వైద్య సిబ్బందికి మధుమేహంతో కలిగే దుష్ప్రభావాలు, పరిష్కార మార్గాల గురించి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మట్లాడుతూ మధుమేహం కారణంగా గుండె జబ్బులు, పక్షవాతం, మానని పండ్లు, వేళ్లు, పాదాలు, కాళ్లు తొలగించడం, కంటిచూపు పోవడం, కిడ్నీలు దెబ్బతినడం వంటి తీవ్ర ప్రభావాలు ఉండడంతో పాటు ప్రాణానికి ముప్పు పెరుగుతుందన్నారు. 30 ఏళ్లు పైబడిన వారందరూ సంవత్సరానికి ఒకసారి మధుమేహ వ్యాధి నిర్ధారణ పరీక్ష చేయించుకోవాలని, ఒకవేళ మధుమేహం నిర్ధారణ అయితే క్రమం తప్పకుండా మందులు వేసుకుంటూ ఆరోగ్యకరమైన జీవన శైలిని అలవర్చుకోవాలని సూచించారు. ప్రస్తుతం జిల్లాలో అన్ని ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాల్లో కాంబినేషన్ డ్రగ్స్, ఇన్సులిన్ ఇంజక్షన్లు అందుబాటులో ఉన్నాయన్నారు. కార్యక్రమంలో ఎన్‌సీడీ ప్రోగ్రాం అధికారి డాక్టర్ కృష్ణ్ణమోహన్, వైద్యాధికారి డాక్టర్ వాణి, డాక్టర్ సుప్రియ, జిల్లా ఉప మాస్ మీడియా అధికారి రాజగోపాల చారి, ఎన్సీడీ కోఆర్డినేటర్స్ విజయ్, మల్లేష్ పాల్గొన్నారు.


