విచ్చలవిడిగా ప్లాస్టిక్ వినియోగం
● కానరాని నివారణ చర్యలు
● గుట్టుచప్పుడు కాకుండా వాడుతున్న వ్యాపారులు
● పట్టించుకోని అధికారులు
లైసెన్సులు రద్దుచేస్తాం
ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించేందుకు దుకాణాదారులు నడుం బిగించాలి. వినియోగదారులు వస్తువులు కొనేందుకు వచ్చేటప్పుడే జూట్ బ్యాగులు వెంట తీసుకొని రావాలని సూచించాలి. సరుకులు ప్లాస్టిక్ కవర్లలో వేసి ఇస్తే వ్యాపారుల ట్రేడ్ లైసన్సులు రద్దుచేస్తాం. మరోమారు ప్లాస్టిక్ వినయోగం చేస్తే భారీ జరిమానాలు విధిస్తాం. దీనిపై క్షేత్రస్థాయిలో కూడా ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాం. చెత్తను డ్రెయినేజీల్లో వేయకుండా చూడాలి.
– మహమూద్ షేక్,
మున్సిపల్ కమిషనర్, కల్వకుర్తి
మున్సిపాలిటీ పోగయ్యే చెత్త ప్లాస్టిక్
కల్వకుర్తి 12–15 3–3.5
కొల్లాపూర్ 9–11 1.5–2.5
అచ్చంపేట 11–13 2.2–3
నాగర్‌కర్నూల్ 12–15 3–3.5
కల్వకుర్తి టౌన్: జిల్లాలోని అన్ని మున్సిపాలిటీల్లో ప్లాస్టిక్ వినియోగం రోజురోజుకూ పెరిగిపోతుంది. 2013లో 40 మైక్రాన్లు లోపు పాలిథిన్ కవర్లు, ప్లాస్టిక్‌ను వాడటాన్ని నిషేధించారు. 2022 జూలై 1 నుంచి 75 మైక్రాన్లలోపు ఉండే సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌పై నిషేధం విధిస్తూ కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. వీటిలో ప్రధానం ప్లాస్టిక్ ప్లేట్లు, గ్లాస్‌లు, స్ట్రా వంటి 19 వంటి వస్తువులను చేర్చారు. కానీ ఇది కేవలం చెప్పుకోవడానికి తప్పా, ఆచరణ సాధ్యం కావటం లేదు. నియంత్రించాల్సిన అధికారులు, వినియోగానికి దూరంగా ఉండాల్సిన ప్రజలు తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. మున్సిపల్ అధికారులు నామమాత్రంగా జరిమానాలు విధిస్తూ మమ అనిపిస్తున్నారు. జిల్లాలోని అన్ని మున్సిపాలిటీల్లో కలిపి ప్రతిరోజు దాదాపు 45 నుంచి 50 మెట్రిక్ టన్నుల వ్యర్థాలను మున్సిపాలిటీ సిబ్బంది సేకరిస్తే వాటిలో 12 నుంచి 15 మెట్రిక్ టన్నుల వరకు ప్లాస్టిక్ వ్యర్థాలు ఉంటున్నాయి.
అన్నింటికీ ప్లాస్టికే..
జిల్లాలోని అన్ని మున్సిపాలిటీల్లో నిత్యవసర సరుకులతో పాటుగా అన్ని రకాల వస్తువులు తీసుకెళ్లేందుకు ప్లాస్టిక్ కవర్లనే వాడుతున్నారు. జిల్లాలోని ప్రతిరోజు ఇళ్లు, హోటళ్లు, ఇతర వ్యాపార సముదాయాల వద్ద 12 నుంచి 15 మెట్రిక్ టన్నుల ప్లాస్టిక్‌తో పాటుగా, ప్లాస్టిక్ సంబంధమైన వ్యర్థాలను డంపింగ్ యార్డుకు తరలిస్తున్నారంటే వినియోగం రోజుకు ఎంత మోతాదులో ఉందో అర్థం చేసుకోవచ్చు. కనిపించని చైతన్యం
జిల్లాలోని అన్ని మున్సిపాలిటీల్లో ప్లాస్టిక్ వినియోగంపై ప్రజల్లో పెద్దగా చైతన్యం కనిపించటం లేదు. ఇంటి నుంచి మార్కెట్‌కు వెళ్లే సమయంలో జూట్ సంచులు తీసుకెళ్లాలనే ఆలోచననే రావడం లేదు. జిల్లాలోని అన్ని మున్సిపాటీల్లో డ్రెయినేజీల్లో దాదాపు 20 శాతం ప్లాస్టిక్ వ్యర్థాలు పేరుకుపోతున్నాయని అధికారులు గుర్తించారు. పారిశుద్ధ్య సిబ్బంది మురుగు తీస్తుంటే వాటిలో ప్లాస్టిక్ కవర్లు, ప్లాస్టిక్‌కు సంబంధించిన చాలా వస్తువులు ఉంటున్నాయి.
తూతూమంత్రంగా అవగాహన
ప్లాస్టిక్ నివారణపై మున్సిపల్ ఉన్నతాధికారులు ఏవైనా ఆదేశాలు ఇస్తేనే తప్ప అధికారులు చర్యలు తీసుకోవడం లేదు. కొన్ని రోజులు హడావిడి చేసే అధికారులు దుకాణ సముదాయాల్లో తూతూమంత్రంగా తనిఖీలు నిర్వహించి, కొన్ని రోజులకు మళ్లీ వాటి జోలికే పోరనే అపవాదు ఉంది. ప్లాస్టిక్ నివారణలో అధికారులే కాకుండా అందరూ భాగస్వాములు అయితేనే ఆశించిన ఫలితం ఉంటుంది.
రోజువారీగా వ్యర్థాలు (టన్నుల్లో..)
విచ్చలవిడిగా ప్లాస్టిక్ వినియోగం


