‘వీ–హబ్’తో మహిళలకు ప్రోత్సాహం
నాగర్‌కర్నూల్: జిల్లాలోని మహిళా పారిశ్రామికవేత్తలకు మరింత ప్రోత్సాహం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా నిర్వహిస్తున్న వీ–హబ్ కార్యక్రమాన్ని సమర్థవంతంగా వినియోగించుకొని మహిళలు ఆర్థికంగా రాణించాలని కలెక్టర్ బాదావత్ సంతోష్ పిలుపునిచ్చారు. శుక్రవారం కలెక్టరేట్ ప్రధాన సమావేశ మందిరంలో జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ, తెలంగాణ వీ–హబ్ ఆధ్వర్యంలో జిల్లాలోని మహిళా పారిశ్రామికవేత్తలకు మార్కెటింగ్, వ్యాపారాభివృద్ధిపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో మహిళలు నిర్వహిస్తున్న చిరు వ్యాపారాలను స్టార్టప్‌లుగా అభివృద్ధి చేయడం ప్రభుత్వం ప్రధాన లక్ష్యమన్నారు. వివిధ వ్యాపారాలు నిర్వహిస్తున్న మహిళలు తమ వ్యాపార ఆలోచనలు, మార్కెటింగ్ తదితర అంశాలను అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ దేవ సహాయం, వీ–హబ్ మహిళా నైపుణ్య అభివృద్ధి సంస్థ డైరెక్టర్ ఊహ, డీఆర్డీఏ పీడీ చిన్న ఓబులేసు, డిప్యూటీ కలెక్టర్లు హర్షవర్ధన్, అశోక్ పాల్గొన్నారు.


