ఎస్పీ పరదేశినాయుడు స్ఫూర్తితో పనిచేయాలి
నాగర్‌కర్నూల్ క్రైం: జిల్లాలోని పోలీసు సిబ్బంది విధి నిర్వహణలో భాగంగా ప్రజల ధన, మాన, ప్రాణాలను రక్షించేందుకు తమ ప్రాణాలు సైతం లెక్కచేయరని ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ అన్నారు. 32 ఏళ్ల క్రితం సోమశిలలో నక్సల్స్ పేల్చిన మందుపాతరకు బలైన ఉమ్మడి జిల్లా ఎస్పీ పరదేశినాయుడితో పాటు పోలీసు సిబ్బందికి ఎస్పీ కార్యాలయంలో శుక్రవారం నివాళులఅర్పించారు. ఈ సందర్భంగా ఎస్పీ మట్లాడుతూ ఉమ్మడి జిల్లా ఎస్పీ పరదేశినాయుడి త్యాగాలను స్మరించుకుంటూ నేటితరం పోలీసులు ప్రజల రక్షణ కోసం ఆత్మస్థైర్యం, ధైర్యసాహసాలతో పనిచేయాలని సూచించారు. సోమశిల ఘటనలో నాటి ఎస్పీ పరదేశినాయుడితో పాటు ఇద్దరు ఎస్‌ఐలు, ఒక హెడ్‌కానిస్టేబుల్, ఐదుగురు కానిస్టేబుళ్లు మృతిచెందడం బాధాకరమన్నారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ నోముల వెంకటేశ్వర్లు, సీఐలు ఉపేందర్‌రావు, కనకయ్య, శంకర్, సీసీ బాలరాజు, ఆర్‌ఎస్‌ఐ గౌస్‌పాష ఉన్నారు.


