నిర్వాసితులు ఏం పాపం చేశారు?
జడ్చర్ల/ భూత్పూర్/ చిన్నచింతకుంట: పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతలలో భాగంగా ఉదండాపూర్, కర్వెన రిజర్వాయర్లలోని భూనిర్వాసితులకు ఎకరాకు రూ.25 లక్షల పరిహారం ఇవ్వాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. పోలేపల్లి భూములకు ఎకరాకు రూ.12.50 లక్షలు ఇచ్చి.. మిగతా భూములకు తక్కువ పరిహారం ఇవ్వడం ఏమిటని ప్రశ్నించారు. ఇక్కడి నిర్వాసితులు ఏం పాపం చేశారని అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు. జాగృతి జనంబాటలో భాగంగా మంగళవారం ఆమె జడ్చర్ల మండలం ఉదండాపూర్, భూత్పూర్ మండలం కర్వెన రిజర్వాయర్లను పరిశీలించి నిర్వాసితులతో మాట్లాడారు. కౌకుంట్ల మండలం అప్పంపల్లిలో అమరవీరుల స్థూపానికి పూలమాలలు వేసి నివాళ్లు అర్పించారు. అంతకుముందు మీనాంబరంలోని పరుశవేదీశ్వరస్వామి ఆలయంలో పూజలు చేశారు. ఆయా ప్రాంతాల్లో ఆమె మాట్లాడుతూ తెలంగాణ వచ్చిన తర్వాత మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి తాగునీటి సరఫరా కల నెరవేరిందన్నారు. చెరువులు, కుంటలను అభివృద్ధి చేసుకున్నామని తెలిపారు. పెద్ద మనస్సుతో ప్రాజెక్టుల కోసం తమ భూములను త్యాగం చేసిన నిర్వాసితులకు న్యాయం చేయాలన్నారు.


