ప్రైవేటుకే పత్తి
● తక్కువ ధరకే ప్రైవేటు వ్యాపారులకు విక్రయం
● క్వింటా పత్తికి ఎక్కడా రూ.7 వేలు దాటని వైనం
● అధిక వర్షాలతో గణనీయంగా తగ్గిపోయిన దిగుబడి
● జిల్లాలో దయనీయంగా పత్తి రైతుల పరిస్థితి
గుదిబండగా మారిన సీసీఐ నిబంధనలు, తేమ శాతం కొర్రీలు
నాగర్‌కర్నూల్ మండలంలోని వనపట్ల గ్రామానికి చెందిన రాములు తనకున్న 7 ఎకరాల్లో పత్తి పంట సాగుచేశాడు. ఈసారి దిగుబడి సగానికి తగ్గి ఎకరాకు 8 క్వింటాళ్లు మాత్రమే వచ్చింది. పంటను గగ్గలపల్లిలోని సీసీఐ కొనుగోలు కేంద్రానికి తీసుకురాగా.. పత్తిలో తేమ 11.5 శాతం ఉండగా, అధికారులు క్వింటాల్‌కు రూ.7,700 మాత్రమే నిర్ణయించారు. ప్రభుత్వం నిర్ణయించిన మేరకు గ్రేడ్ 3 రకమైన క్వింటాల్‌కు రూ.8,010 కనీస ధర సైతం ఎవరికీ దక్కడం లేదు. ఇప్పటికే దిగుబడి తగ్గి సగం నష్టపోయిన తాము కనీస ధర దక్కక మరింత నష్టపోతున్నామని రైతు వాపోయాడు.
సాక్షి, నాగర్‌కర్నూల్: జిల్లాలో పత్తి రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. ఈసారి అధిక వర్షాలకు పత్తి పంట దెబ్బతిని దిగుబడి గణనీయంగా పడిపోయింది. అరకొరగా పండిన పంటను విక్రయించేందుకు సీసీఐ కొనుగోలు కేంద్రాలకు వెళ్తే అక్కడ ఇబ్బందులు తప్పడం లేదు. సీసీఐ నిబంధనల మేరకు పింజరకం గ్రేడ్–1 పత్తి క్వింటాల్‌కు రూ.8,110, గ్రేడ్–3 ప్రకారం కనీస మద్దతు ధర రూ.8,010 చొప్పున దక్కాల్సి ఉండగా.. ఎక్కడా క్వింటాల్‌కు రూ.7,600 వేలు దాటడం లేదు. తేమశాతం పేరుతో అధికారుల నుంచి తిరస్కరణకు గురవుతుండటంతో దిక్కులేని పరిస్థితుల్లో అధిక శాతం రైతులు ప్రైవేటు వ్యాపారులకు అమ్ముకోవాల్సి వస్తోంది. ఇదే అదునుగా వ్యాపారులు అతి తక్కువ ధరకు పంటను కొనుగోలు చేస్తుండటంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు.
సగానికి తగ్గిన దిగుబడి..
ఈసారి పత్తి సాగుచేసిన రైతులు అధిక వర్షాలు, తెగుళ్ల కారణంగా పంట దిగుబడిపై ఆశలు వదులుకున్నారు. నిరంతరం కురుస్తున్న వర్షాలతో పంటలో నీరు నిలిచి పంటకు తీవ్ర నష్టం వాటిల్లింది. పింద దశలోనే పత్తిమొక్కలు ఎర్రబారి ఆశించిన స్థాయిలో ఎదగలేదు. గతంలో ఎకరాకు కనీసం 10 నుంచి 12 క్వింటాళ్ల వరకు దిగుబడి రాగా.. ఈసారి గరిష్టంగా 6 క్వింటాళ్లు కూడా దాటడం లేదని రైతులు వాపోతున్నారు. పెట్టుబడి, ఎరువులు, కూలీల ఖర్చులు సైతం వచ్చేలా లేవని దిగులు చెందుతున్నారు.


