అవినీతి నిర్మూలనే లక్ష్యంగా పాలన
నాగర్‌కర్నూల్: అవినీతికి తావులేకుండా పారదర్శకతతో కూడిన సమర్థవంతమైన పాలన అందించడమే లక్ష్యంగా ముందుకెళ్తున్నామని, ప్రతి ప్రభుత్వ ఉద్యోగి నీతి, నిజాయితీగా ఉంటూ ప్రజలకు సేవ చేయాలని కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. మంగళవారం కలెక్టరేట్‌లో జిల్లా అధికారులు, కలెక్టరేట్ సిబ్బందితో సమావేశ మందిరంలో విజిలెన్స్ అవగాహన వారోత్సవాలను పురస్కరించుకుని సత్యనిష్ఠ ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈ నెల 27 నుంచి నవంబర్ 2 వరకు కల్చర్ ఆఫ్ ఇంటెగ్రిటీ ఫర్ నేషన్స్ ప్రాస్పర్టీ అనే థీమ్‌తో విజిలెన్స్ అవగాహన వారోత్సవాలు నిర్వహిస్తున్నామన్నారు. ఇందులో భాగంగా ప్రభుత్వ కార్యాలయాల్లో, ప్రజల్లో అవినీతి నిర్మూలనపై క్విజ్ పోటీలు వాక్‌థాన్, మారథాన్, వీధి నాటకాలు, గ్రామసభలు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. ప్రతి ఉద్యోగి సమగ్రత, పారదర్శకత జవాబుదారీతనాన్ని విధిగా విధుల్లో అలవర్చుకోవాలని సూచించారు. అవినీతిని నిరోధించడంలో పౌరులందరూ భాగస్వాములు కావాలని, ప్రోత్సహించడం, సమగ్రత, పారదర్శకత, జవాబుదారితనం యొక్క సంస్కృతిని బలోపేతం చేయడం దీని ప్రధాన లక్ష్యం అన్నారు. అనంతరం విజిలెన్స్ వారోత్సవాల వాల్‌పోస్టర్ కలెక్టర్ ఆవిష్కరించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ అమరేందర్, విజిలెన్స్ ఇన్‌స్పెక్టర్ సురేందర్‌రెడ్డి, అగ్రికల్చర్ ఏడీ విజయ్‌కుమార్, కలెక్టరేట్ ఏఓ చంద్రశేఖర్, రవాణా ఇన్‌స్పెక్టర్ అవినాష్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
నిబంధనల మేరకే ఇసుక రవాణా
జిల్లాలో ఇసుక తవ్వకం, రవాణా పూర్తిగా ప్రభుత్వ నిబంధనల ప్రకారమే జరగాలని కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. కలెక్టర్ చాంబర్‌లో అదనపు కలెక్టర్ అమరేందర్‌తో కలిసి జిల్లాస్థాయి సాండ్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఉప్పునుంతల మండలం దాసర్లపల్లిలో ఉన్న రెండు ఇసుక రీచ్‌లకు సంబంధించి నివేదిక, తిమ్మాజిపేట మండలం పోతిరెడ్డిపల్లిలో ఇసుక రీచ్‌లను కొనసాగించాలన్న ప్రతిపాదనలను కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఇసుకను చట్టవిరుద్ధంగా తవ్వడం, రవాణా చేయడంలో పాల్గొనే వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని పోలీస్, మైనింగ్ అధికారులకు సూచించారు. ప్రభుత్వ ప్రాజెక్టులు, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు ఇసుక కొరత రాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో జిల్లా మైనింగ్ అధికారి వెంకటరమణ, నీటిపారుదల శాఖాధికారి మురళి, భూగర్భజల శాఖాధికారి దివ్యజ్యోతి, టీజీఎండీసీ మేనేజర్ శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.


