16వ శతాబ్ది దీపక్ స్తంభాన్ని నిలబెట్టాలి
పెంట్లవెల్లి: జటప్రోల్‌లోని మదనగోపాలస్వామి ఆలయం వద్ద అపురూప శిల్పాలతో చెక్కిన 16వ శతాబ్ది నాటి దీపక్ స్తంభం నిర్లక్ష్యంగా పడి ఉందని.. దాన్ని ఆలయానికి తరలించి పునఃప్రతిష్ఠించాలని పురావస్తు శాఖ పరిశోధకుడు శివనాగిరెడ్డి కోరారు. సోమవారం ఆయన జటప్రోల్, మల్లేశ్వరం దేవాలయాలను సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. జటప్రోల్, మల్లేశ్వరం గ్రామాల్లో నీటిముంపు నుంచి బయటకు తరలించిన 30కి పైగా దేవాలయాలను పునర్నిర్మించిన జటప్రోల్ క్రాస్‌రోడ్డు జిల్లాలోనే ప్రముఖ పర్యాటక కేంద్రంగా వెలుగొందుతోందన్నారు. ఆయా దేవాలయాలతో పాటు కళ్యాణి చాళుక్య కాకతీయ జటప్రోల్ సంస్థాన కాలపు వాస్తు శిల్పాలను చూసేందుకు రోజు అనేక మంది పర్యాటకులు వస్తుంటారన్నారు. ఇటీవల పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రసిద్ధ ఆలయాల అభివృద్ధికి చర్యలు చేపట్టడం హర్షణీయమన్నారు. పురావస్తు ఆలయాలను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు.


