పన్ను వసూళ్లలో వేగం పెంచాలి
కల్వకుర్తి టౌన్: మున్సిపాలిటీలో పన్నుల వసూళ్లలో వేగం పెంచాలని కమిషనర్ మహమూద్ షేక్ వార్డు ఆఫీసర్లకు సూచించారు. సోమవారం పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో వార్డు ఆఫీసర్లు, రెవెన్యూ సెక్షన్ సిబ్బందితో సమావేశం నిర్వహించి పలు సూచనలు చేశారు. మున్సిపాలిటీలో నీటి కనెక్షన్లు అక్రమంగా ఉంటే వెంటనే తొలగించాలని, ఉన్నవాటికి జియో ట్యాగింగ్ చేపట్టాలన్నారు. మెప్మా ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వీధి విక్రయ వ్యాపారులను గుర్తించి వారికి తగు గుర్తింపు కార్డులు ఇవ్వాలన్నారు. మాంసం విక్రయదారులు వధశాలలోనే వధ చేయాలని, లేనిపక్షంలో వారిపై తగు చర్యలను తీసుకోవాలని శానిటేషన్ సిబ్బందికి సూచించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్లు కేటాయించిన లబ్ధిదారుల వివరాలను జియోట్యాగింగ్ చేయాలని, అందరి వివరాలను సక్రమంగా ఎలాంటి తప్పులు లేకుండా ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని ఆదేశించారు. సమావేశంలో మున్సిపల్ ఏఈ షబ్బీర్, మేనేజర్ రాజకుమారి, శానిటరీ ఇన్‌స్పెక్టర్ రంగన్న, వార్డు ఆఫీసర్లు, సిబ్బంది పాల్గొన్నారు.


