తోటల్లో పనులు ప్రారంభించిన రైతులు
జిల్లాలో సాగు ఇలా..
కొల్లాపూర్: ఖరీఫ్ సీజన్ ముగింపు దశకు చేరుకోగా.. రబీ సీజన్ రాబోతోంది. ఒకప్పుడు రబీ సీజన్ మధ్యలో మామిడి తోటల సాగు పనులు ప్రారంభించేవారు. అయితే మారిన వాతావరణ పరిస్థితులు, ముందస్తు దిగుబడుల కోసం రైతులు మామిడి సాగుకు ముందుగానే శ్రీకారం చుడుతున్నారు. ఖరీఫ్ సీజన్ ముగింపు సమయం నుంచే మామిడి తోటల్లో సాగు పనులు మొదలుపెట్టారు. కాగా.. అధిక దిగుబడుల కోసం విరివిగా రసాయనాలు వినియోగిస్తుండడంతో కొన్నిచోట్ల మామిడి చెట్లు మోడువారుతున్నాయి. దీంతో ఎండిన చెట్లను తొలగించి కొత్త రకం ఉద్యాన పంటల సాగుకు రైతులు మొగ్గుచూపుతున్నారు.
వినూత్న పద్ధతులు..
మామిడి సాగులో రైతులు కొత్త పద్ధతులకు అలవాటు పడుతున్నారు. సంప్రదాయ పద్ధతిలో సాగు చేస్తే మామిడి పూతలు జనవరి నెలలో ప్రారంభమవుతాయి. ఏప్రిల్ నెల వరకు కాయలు విక్రయ దశకు చేరుకుంటాయి. కానీ, అప్పటికే మార్కెట్లో మామిడి ధరలు పూర్తిగా పడిపోయి.. రైతులు ఆర్థికంగా నష్టపోతున్నారు. ఈ సమస్య కారణంగా ముందస్తుగా చెట్లకు పూతలు పూయించేందుకు వివిధ రకాలు రసాయనాలు వాడుతున్నారు. వాటితోపాటే సాగు పనులు సైతం మొదలుపెడుతున్నారు. జిల్లావ్యాప్తంగా ఇప్పటికే మామిడి తోటలు సాగు చేస్తున్న, కౌలు తీసుకున్న రైతులు భూమి దున్నకాలు పూర్తిచేశారు. పాదులు తీసి పూతలు రావడానికి అవసరమైన మందులు పిచికారీ చేశారు. నవంబర్ నెల వరకు భూమిని బెట్టగా ఉంచాల్సి ఉండగా, అందుకు భిన్నంగా వర్షాలు లేని చోట్ల చెట్లకు నీటిని అందిస్తున్నారు. ముందస్తుగా కాపు కాస్తేనే తమకు ఎంతో కొంత లాభాలు వస్తాయని రైతులు ఆశిస్తున్నారు.
జీవితకాలం తగ్గిపోయి..
మామిడి అధిక దిగుబడి కోసం విరివిగా రసాయనాలు వినియోగిస్తుండడంతో మామిడి చెట్ల జీవితకాలం తగ్గుతోంది. అధిక మోతాదులో రసాయనాలు వినియోగించిన చెట్లు కొంతకాలం తర్వాత పంట దిగుబడి ఇవ్వకుండా మోడువారుతుండడంతో రైతులు వాటిని తొలగించి ఇతర ఉద్యాన పంటల సాగు వైపు దృష్టి సారిస్తున్నారు. గత రెండేళ్ల కాలంలో కొల్లాపూర్, పెద్దకొత్తపల్లి, వీపనగండ్ల మండలాల్లో దాదాపు 300 ఎకరాల మేర మామిడి చెట్లను తొలగించారు.
జిల్లాలో మామిడి సాగు వివరాలు
నియోజకవర్గం మామిడి సాగు సాగువిస్తీర్ణం
చేస్తున్న రైతులు ఎకరాల్లో
కొల్లాపూర్ 13,217 26,317
కల్వకుర్తి 1,349 5,199
నాగర్‌కర్నూల్ 1,047 3,210
అచ్చంపేట 830 2,615
జిల్లావ్యాప్తంగా 37,343 ఎకరాల్లో మామిడి తోటలు సాగుచేస్తుండగా.. వీటిలో కొల్లాపూర్ నియోజకవర్గంలోనే అత్యధికంగా 26,317 ఎకరాల్లో సాగు జరుగుతున్నట్లు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. వనపర్తి జిల్లా పరిధిలోని చిన్నంబావి, వీపనగండ్ల, పాన్‌గల్ మండలాల్లో దాదాపు 3 వేల ఎకరాల్లో మామిడి తోటలు ఉన్నాయి. రెండు జిల్లాల పరిధిలోని సాగు విస్తీర్ణం కొల్లాపూర్ నియోజకవర్గంలో 30 వేల ఎకరాల మేర ఉంటుంది. మామిడి పంట ఎకరాకు 2.5– 3 మెట్రిక్ టన్నుల వరకు దిగుబడి వస్తుంది.
దిగుబడుల కోసం
ముందుగానే ప్రయత్నం
ఆలస్యంగా చేతికొస్తే ధరలు
తగ్గుతాయని ఆందోళన
మారుతున్న వాతావరణ పరిస్థితులతో తోటల పెంపకంపైనా అనాసక్తి
గడిచిన రెండేళ్లలో 300 ఎకరాల్లో మామిడి చెట్ల తొలగింపు
తోటల్లో పనులు ప్రారంభించిన రైతులు


