స్థానికులకే లక్కీ లాటరీ
నాగర్‌కర్నూల్ క్రైం: మద్యం పాలసీ 2025– 27కి సంబంధించి దుకాణాల కేటాయింపు ప్రక్రియ సోమవారం ప్రశాంతంగా ముగిసింది. మద్యం దుకాణాలు దక్కించుకున్న వారిలో ఎక్కువగా జిల్లాకు చెందిన వ్యాపారులే ఉన్నారు. ఈ క్రమంలో జిల్లాకేంద్రంలోని కలెక్టరేట్ పరిసర ప్రాంతంలో ఉదయం నుంచే వ్యాపారుల కోలాహలంగా కనిపించింది. ఈ ఏడాది టెండర్ దరఖాస్తు ఫీజు రూ.3 లక్షలకు పెంచడంతో జిల్లాలో 67 మధ్యం దుకాణాలకు గాను 1,518 దరఖాస్తులు వచ్చాయి. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2.30 గంటలకు వరకు కలెక్టర్ బదావత్ సంతోష్ దరఖాస్తుదారుల ఎదుటే లాటరీ విధానంలో మద్యం దుకాణాలు కేటాయించారు. టెండర్‌దారులు తమ అదృష్టాన్ని పరిశీలించుకునేందుకు ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఓపికగా వేచి ఉన్నారు. లాటరీలో అదృష్టం వరించిన వారు సంబరాలలో మునిగితేలగా.. దక్కని వారు నిరాశతో వెనుదిరిగారు. మద్యం టెండర్‌దారులు పెద్ద ఎత్తున హాజరుకావడంతో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసి స్టేషన్ల వారీగా లాటరీ పద్ధతిలో డ్రా తీసి దుకాణాలు కేటాయించారు.
ఉత్కంఠ
వాతావరణం..
జిల్లాలోని 67 మద్యం దుకాణాలకు సంబంధించి లాటరీ పద్ధతి ద్వారా దుకాణాలను కేటాయించడంతో నాగర్‌కర్నూల్, కల్వకుర్తి, కొల్లాపూర్, అచ్చంపేట నియోజకవర్గాలతోపాటు ఇతర జిల్లాల నుంచి టెండర్‌దారులు పెద్దఎత్తున వచ్చారు. దరఖాస్తుదారులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండటం కోసం కలెక్టరేట్ ప్రాంగణంలో షామియానాతోపాటు కుర్చీలు ఏర్పాటు చేశారు. కలెక్టర్ ప్రతి మద్యం దుకాణానికి సంబంధించి టెండర్‌దారుల ముందే లాటరీ తీసి డ్రాలో వచ్చిన వారికి దుకాణం కేటాయించారు. జిల్లాలో 67 మద్యం దుకాణాలకు గాను 1,518 దరఖాస్తులు రాగా.. డ్రాలో 12 మహిళలు సైతం వైన్‌షాపులు దక్కించుకోగా.. మిగతా 55 దుకాణాలు పురుషులను వరించాయి. మద్యం దుకాణాలను దక్కించుకున్న యజమానుల 1/6 వంతు లైసెన్సు ఫీజు ఎకై ్సజ్ శాఖకు చెల్లించాల్సి ఉండగా వ్యాపారులు అక్కడే ఏర్పాటు చేసిన బ్యాంకు కౌంటర్లలో నగదు చెల్లించారు. లైసెన్సు దక్కించుకున్నవారు డిసెంబర్ 1 నుంచి దుకాణాలు ప్రారంభించాల్సి ఉంటుంది.
ఎవరెవరికి అంటే..
జిల్లాలో పెద్దమొత్తంలో దరఖాస్తు చేసుకున్న వారికి ఈ ఏడాది ఒక్క షాపు మాత్రమే రాగా.. మరికొందరికి ఒక్కటి కూడా రాకపోవడంతో నిరాశపడ్డారు. ఈ క్రమంలో జిల్లాకేంద్రంలోని 1వ దుకాణం నాగర్‌కర్నూల్‌కు చెందిన మాచిపెద్ది స్వప్న, 2వ దుకాణం నెల్లికొండకు చెందిన అరుణ, 3వ దుకాణం హైదరాబాద్ భర్కత్‌పురకు చెందిన వంగ మాధవి, 6వ దుకాణం రంగారెడ్డి జిల్లా తొర్రూరుకు చెందిన సాహితి శ్రీని, పెంట్లవెల్లిలోని 24వ దుకాణం గద్వాలకు చెందిన శిరీష, రాజాపూర్‌లోని 30వ దుకాణం హైదరాబాద్‌కు చెందిన ప్రశాంతి, కల్వకుర్తిలోని 41వ దుకాణం అమ్రబాద్ మండలం తుర్కపల్లికి చెందిన సీతారెడ్డి, కల్వకుర్తిలోని 55వ దుకాణం మిడ్జిల్ మండలం వేములకు చెందిన యాదమ్మ, అచ్చంపేటలోని 58వ దుకాణం నల్లగొండ జిల్లా దేవరకొండకు చెందిన నిర్మల, అచ్చంపేటలోని 59వ దుకాణం అచ్చంపేటకు చెందిన మౌనిక, అచ్చంపేటలోని 65వ దుకాణం పదరకు చెందిన బాలమణి లాటరీలో దక్కించుకున్నారు. కాగా.. జిల్లాకు చెందిన మద్యం వ్యాపారులకే ఎక్కువ షాపులు వచ్చాయి. ఏపీకి చెందిన ఒక్క మద్యం వ్యాపారి కూడా లక్కీ డ్రాలో గెలుపొందలేదు. లక్కీ డ్రా కార్యక్రమాన్ని ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్, ఎకై ్సజ్ సూపరింటెండెంట్ గాయత్రి పర్యవేక్షించారు.
ప్రశాంతంగా ముగిసిన మద్యం షాపుల కేటాయింపు ప్రక్రియ
జిల్లాలో మహిళలను
వరించిన 12 వైన్ షాపులు
భారీగా తరలివచ్చిన వ్యాపారులు
స్థానికులకే లక్కీ లాటరీ


