
బడి జాగాకే ఎసరు!
బిజినేపల్లి జెడ్పీహెచ్‌ఎస్ స్థలంపై రియల్టర్ల కన్ను
● ప్రధాన రహదారి పక్కనే ఉన్న భూమిని దక్కించుకునేందుకు కుటిల యత్నాలు
● పాఠశాల స్థలంలో కమర్షియల్ షాపుల ఏర్పాటుకు పన్నాగం
● ప్రజావాణిలో కలెక్టర్‌కు గామస్తుల ఫిర్యాదు
●
పాఠశాల భూమిని కాపాడాలి..
మా గ్రామంలోని ప్రభుత్వ పాఠశాల స్థలాన్ని కొందరు సొంతం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ స్థలంలో మా చిన్నతనం నుంచే ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, తర్వాత ప్రభుత్వ పాఠశాల నడుస్తోంది. అధికారులు స్పందించి ప్రభుత్వ పాఠశాల స్థలాన్ని కాపాడాలి.
– నర్సింహారెడ్డి, పాలెం, బిజినేపల్లి మండలం
విచారణ చేపడతాం..
పాలెం జెడ్పీహెచ్‌ఎస్ స్థల వివాదంపై ఫిర్యాదు అందింది. ఈ స్థలం ఏళ్లుగా ప్రభుత్వ అధీనంలోనే ఉంది. పాఠశాల స్థలాన్ని ఇతరులు తమ పేరిట మార్చుకున్నారన్న ఫిర్యాదుపై సమగ్రంగా విచారణ చేపడతాం. నివేదికను ఉన్నతాధికారులకు అందిస్తాం.
– మునీరుద్దీన్, తహసీల్దార్, బిజినేపల్లి
సాక్షి, నాగర్‌కర్నూల్: పెరుగుతున్న భూముల ధరలు.. రియల్ ఎస్టేట్ వ్యాపారంతో ప్రభుత్వ, అసైన్డ్ భూములు, ఖాళీ స్థలాలపై కన్నేస్తున్న అక్రమార్కుల చూపు ఏకంగా సర్కారు బడి జాగపై పడింది. ఆరు దశాబ్దాలుగా ప్రభుత్వ ఆస్పత్రి, ఆ తర్వాత ప్రభుత్వ పాఠశాల కొనసాగుతున్న స్థలాన్ని కాజేసేందుకు కొందరు రియల్టర్లు కుట్రలు పన్నుతున్నారు. ఇందుకు ఓ ప్రధాన రాజకీయ పార్టీకి చెందిన నాయకుడు, మాజీ ప్రజాప్రతినిధి అండదండగా ఉండటం.. పట్టా మార్పిడిలో అన్నీ తానై వ్యవహరించడం గమనార్హం.
1961లో పీహెచ్‌సీ ఏర్పాటు..
బిజినేపల్లి మండలం పాలెం గ్రామంలోని సర్వే నంబర్ 23లో ఉన్న 1.30 ఎకరాల భూమిని ప్రాథమిక ఆరోగ్యకేంద్రం నిర్మాణం కోసం సంబంధిత యజమాని ప్రభుత్వానికి దానంగా ఇచ్చారు. 1961 మే 12న అప్పటి ముఖ్యమంత్రి దామోదర సంజీవయ్య చేతుల మీదుగా ఆస్పత్రి భవనాన్ని ప్రారంభించారు. తర్వాత ఆస్పత్రిని మరో చోట విశాలమైన భవనంలోకి మార్చగా.. పాత భవనంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను నిర్వహిస్తున్నారు.
ప్రధాన పార్టీ నేత కీలకపాత్ర..
ప్రభుత్వ పాఠశాల స్థలాన్ని ఇతరుల పేరిట రిజిస్ట్రేషన్ చేసిన ఉదంతంలో మండలానికి చెందిన ఓ మాజీ ప్రజాప్రతినిధి, ప్రధాన రాజకీయ పార్టీకి చెందిన నాయకుడు కీలకంగా వ్యవహరించినట్టు తెలుస్తోంది. రిజిస్ట్రేషన్ సమయంలో సాక్షి పాత్రతో సహా అన్నీ తానై వ్యవహరించడం గమనార్హం. ఈ వ్యవహారంలో సంబంధిత అధికారుల పాత్ర ఉందన్న ఆరోపణలు ఉన్నాయి. ఉన్నతాధికారులు విచారణ చేపట్టి, పాఠశాల స్థలాన్ని కాపాడాలని గ్రామస్తులు కోరుతున్నారు.
దశాబ్దాల క్రితం దానం ఇచ్చినా.. రికార్డుల్లో పాత పేర్లే
పాలెంలోని ప్రభుత్వ కార్యాలయాలు, ఆస్పత్రులు, బ్యాంకులు, అగ్రికల్చర్ యూనివర్సిటీ, పాలెం వేంకటేశ్వర దేవాలయ భూములన్నీ గతంలో దాతలు ఇచ్చినవే. వేంకటేశ్వరస్వామి ఆలయం, డిగ్రీ కళాశాల కోసం పలువురి నుంచి భూమిని సేకరించి.. ప్రభుత్వానికి దానంగా ఇచ్చారు. అయితే దశాబ్దాలు గడుస్తున్నా రికార్డుల్లో మాత్రం పేర్లు మారలేదు. ఇప్పటికీ పాత యజమానుల పేర్లే రికార్డుల్లో ఉన్నాయి. దీంతో ఆయా భూములను వారి పేర్ల నుంచి ఇతరులు రిజిస్ట్రేషన్ చేయించుకోవడంతో సమస్యలు ఎదురవుతున్నాయి.

బడి జాగాకే ఎసరు!