
పర్యాటకుల భద్రతకు పటిష్ట చర్యలు : ఎస్పీ
నాగర్‌కర్నూల్ క్రైం: జిల్లాలోని పర్యాటక కేంద్రాల వద్ద పర్యాటకుల పటిష్ట భద్రత కోసం ప్రత్యేకంగా 10 మంది టూరిస్టు పోలీసులను నియమించినట్లు ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ తెలిపారు. సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో టూరిస్టు పోలీసులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. జిల్లాలోని సోమశిల, సింగోటం, మద్దిమడుగు, ఉమామహేశ్వరం, ఆక్టోపస్ వ్యూ పాయింట్లకు వచ్చే పర్యాటకులకు వాటి ప్రాముఖ్యతను వివరించడానికి, వారి భద్రత కోసం ఉమెన్ సేఫ్టీవింగ్, చిన్నారుల భద్రత కోసం 10మంది కానిస్టేబుళ్లను రాష్ట్ర పర్యాటక విభాగానికి కేటాయించినట్లు వివరించారు. ఆయా ప్రదేశాలను సందర్శించే పర్యాటకులు, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్నివిధాలా భద్ర తా చర్యలు చేపట్టాలని ఎస్పీ సూచించారు.
● పోలీసు ప్రజావాణికి వచ్చే ఫిర్యాదులను త్వరగా పరిష్కరించేందుకు సిబ్బంది కృషి చేయాలని ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ అన్నారు. జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలతో ఆయన నేరుగా మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. అనంతరం ఫిర్యాదులు స్వీకరించారు. మొత్తం 15 ఫిర్యాదులు అందాయని.. వాటిలో 11 భూ తగాదాలు, 2 భార్యాభర్తల గొడవలు, 2 తగున్యాయం కోసం ఫిర్యాదులు వచ్చినట్లు తెలిపారు.
ఆర్‌ఐటీఐలో
స్పాట్ అడ్మిషన్లు
మన్ననూర్: స్థానిక మన్ననూర్ ఆర్‌ఐటీఐలో మిగులు సీట్లుగా ఉన్న ట్రేడ్ల భర్తీకి స్పాట్ అడ్మిషన్లు కల్పిస్తున్నట్లు ఐటీఐ కళాశాల ప్రిన్సిపాల్ లక్ష్మణస్వామి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇదివరకే దరఖాస్తు చేసుకొని సీటు రాని వారితో పాటు కొత్తగా దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించినట్లు పేర్కొన్నారు. విద్యార్థుల మెరిట్ ప్రాతిపదికన కౌన్సెలింగ్ చేపట్టి వాక్–ఇన్ అడ్మిషన్ విధానంలో నేరుగా ప్రవేశాలు కల్పించనున్నట్లు తెలిపారు. అర్హత, ఆసక్తిగల విద్యార్థులు http;//ititelangana.gov.in వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈ నెల 17న మధ్యాహ్నం 1గంటలోగా ఒరిజినల్ ధ్రువపత్రాలతో కౌన్సెలింగ్‌కు హాజరుకావాల్సి ఉంటుందని తెలిపారు. పూర్తి వివరాలకు 85004 61013, 85004 61022 నంబర్లను సంప్రదించాలని సూచించారు.