
‘అధికార’ వార్..!
కాంగ్రెస్‌లో అంతర్గత పోరు
అన్నీ మహబూబ్‌నగర్ వాళ్లకేనంటూ..
మహబూబ్‌నగర్ జిల్లాలోని మూడు నియోజకవర్గాల కీలక నేతల మధ్య తొలి నుంచీ అంతర్గత విభేదాలు నెలకొన్నాయి. కాంగ్రెస్ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత జిల్లా గ్రంథాలయ చైర్మన్, ముడా చైర్మన్ పదవులు మహబూబ్‌నగర్ నియోజకవర్గానికి దక్కాయి. రాష్ట్ర మైనార్టీ కార్పొరేషన్ పదవి సైతం ఈ సెగ్మెంట్‌కు చెందిన ఒబేదుల్లా కొత్వాల్‌కు కేటాయించారు. ఈ క్రమంలో అన్ని పదవులు మహబూబ్‌నగర్ నియోజకవర్గ నేతలే తన్నుకుపోతున్నారనే అభిప్రాయం జడ్చర్ల నాయకుల్లో ఉంది. దేవరకద్రకు చెందిన సీతాదయాకర్‌రెడ్డి తెలంగాణ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్‌పర్సన్‌గా నియామకమైనప్పటికీ.. మహబూబ్‌నగర్‌కే పెద్దపీట వేస్తున్నారనే అభ్రిపాయం ఈ సెగ్మెంట్ నేతల్లోనూ వ్యక్తమవుతోంది.
మా సెగ్మెంట్‌లోనూ పెత్తనం చెలాయిస్తున్నారని..
డీసీసీ అధ్యక్షుడిగా ఉన్న దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూదన్‌రెడ్డి జిల్లాకేంద్రంలో పార్టీ కార్యక్రమాలు నిర్వహించడాన్ని ఇక్కడి నాయకులు జీర్ణించుకోలేకపోతున్నట్లు తెలుస్తోంది. తమ నియోజకవర్గంలోనూ ఆయన పెత్తనం సాగుతోందని స్థానిక ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి అనుచరుల్లో నెలకొంది. దీనిపై యెన్నం ఎక్కడా స్పందించకున్నా.. డీసీసీ అధ్యక్షుడు జీఎమ్మార్ ఆధ్వర్యంలో జరిగిన పలు కార్యక్రమాలకు హాజరుకాకపోవడం, అంటీముట్టనట్లుగా వ్యవహరించడంపై పార్టీలో చర్చ జోరుగా సాగుతోంది.
గద్వాల, వనపర్తిలోనూ లుకలుకలు..
వనపర్తి జిల్లాలో ప్రస్తుతం డీసీసీ అధ్యక్షుడిగా ఉన్న రాజేంద్రప్రసాద్ మరోసారి తనకు అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి అనుచరుడు లక్కాకుల సతీష్, ప్రణాళిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి వర్గానికి చెందిన కిరణ్‌కుమార్ పోటీలో ఉన్నారు. వీరితో పాటు శాట్ చైర్మన్ శివసేనారెడ్డి సైతం డీసీసీ అధ్యక్ష పదవిని ఆశిస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలో ఆయా నేతల వర్గాల మధ్య వైరం మరింత ముదిరినట్లు తెలుస్తోంది. జోగుళాంబ గద్వాల జిల్లాలో ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, జెడ్పీ మాజీ అధ్యక్షురాలు సరిత మధ్య విభేదాలు తారస్థాయికి చేరగా.. ఆయా వర్గాలకు చెందిన నేతలు డీసీసీ పదవికి పోటీ పడుతున్నారు. ఇక్కడ ఏఐసీసీ నాయకుడు సంపత్‌కుమార్ మద్దతు కీలకం కాగా.. చివరి వరకు ఏం జరుగుతుందనే ఉత్కంఠ నెలకొంది. ఇదిలా ఉండగా.. మహబూబ్‌నగర్ జిల్లాలోని ముగ్గురు ఎమ్మెల్యేలు తమ మధ్య ఎలాంటి అంతర్గత విభేదాలు లేవని.. పార్టీ విధానాల ప్రకారం సమష్టి నిర్ణయాలతోనే ముందుకు సాగుతున్నామని చెబుతున్నారు. కానీ వారివారి ముఖ్య అనుచరులతో పాటు పార్టీ శ్రేణుల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఇటు ‘ఢీ’ సీసీ.. అటు ‘చేరిక’పంచాయితీ
మాటల తూటాలను పేలుస్తున్న నేతలు
మహబూబ్‌నగర్‌లో తారాస్థాయికి విభేదాలు ?
గద్వాల, వనపర్తి జిల్లాల్లోనూ కుతకుత