
ఆకస్మిక మరణాలను నియంత్రించేందుకే సీపీఆర్
నాగర్‌కర్నూల్: సీపీఆర్‌తో ఆకస్మిక మరణాలను నియంత్రించవచ్చని కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. సోమవారం జిల్లా వైద్యారోగ్యశాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో సీపీఆర్‌పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రతి సంవత్సరం వేలాది మంది గుండెపోటుతో ఆకస్మికంగా మరణిస్తున్నారన్నారు. ఆకస్మిక మరణాలను నివారించేందుకు ప్రతిఒక్కరూ సీపీఆర్ ప్రక్రియ నేర్చుకోవాలని ఆయన సూచించారు. సీపీఆర్‌తో ప్రాణాపాయం నుంచి 50 శాతం వరకు రోగులు బతికే అవకాశం ఉంటుందని వివరించారు. అన్ని పాఠశాలలు, కళాశాలల్లో సీపీఆర్‌పై శిక్షణ అందించేలా కార్యాచరణ రూపొందించాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు.అంతకుముందు సీపీఆర్ ప్రక్రియపై డా.శివకుమార్ వివరంగా చూపించారు. డీఎంహెచ్‌ఓ డా.రవికుమార్ అధికారులతో ప్రతిజ్ఞ చేయించారు.
ప్రజలతో గౌరవంగా వ్యవహరించాలి..
వివిధ సమస్యలపై అధికారుల వద్దకు వచ్చే ప్రజలతో గౌరవంగా వ్యవహరించి దరఖాస్తులు స్వీకరించాలని కలెక్టర్ బదావత్ సంతోష్ సూచించా రు. కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు అమరేందర్, దేవ సహాయంతో కలిసి ఆయన ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. మొత్తం 48 ఫిర్యాదులు అందగా.. పరిష్కారం నిమిత్తం సంబంధిత అధికారులకు పంపించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రజావాణి ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పరిశీలించి పరిష్కరించాలని అధికారులకు సూచించా రు. వినతులపై చేపట్టిన చర్యలను వివరిస్తూ ఆన్‌లైన్‌లో నమోదు చేయాలన్నారు. కార్యక్రమాల్లో కలెక్టరేట్ ఏఓ చంద్రశేఖర్ పాల్గొన్నారు.