హే కృష్ణా.. ఇకనైనా! | - | Sakshi
Sakshi News home page

హే కృష్ణా.. ఇకనైనా!

Sep 16 2025 7:23 AM | Updated on Sep 16 2025 7:23 AM

హే కృ

హే కృష్ణా.. ఇకనైనా!

కృష్ణజింకలతో పంట పొలాలు నాశనం

ఎన్ని ప్రయత్నాలు చేసినా..

ప్రభుత్వం స్పందించినా..

సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్‌: నారాయణపేట జిల్లా కృష్ణానది పరివాహక ప్రాంతాల్లోని రైతుల రోదన అరణ్య రోదనగా మిగులుతోంది. వేల సంఖ్యలో కృష్ణ్ణ జింకలు పంటలను నాశనం చేస్తుండడం ఏటేటా నిత్యకృత్యంగా మారింది. ప్రజాప్రతినిధులు, అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నా.. ఫలితం లేకపోవడంతో బాధిత రైతుల్లో ఆందోళన నెలకొంది. కృష్ణ జింకలను పట్టుకుని అడవులకు తరలించేలా చర్యలు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిధులు కేటాయించినా.. రిహాబిలిటేషన్‌ సెంటర్‌ ఏర్పాటులో జాప్యం జరుగుతూనే ఉంది. అధికారుల్లో కొరవడిన ప్రణాళిక, పలు ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయ లేమి వెరసీ రైతులకు తిప్పలు తప్పడం లేదు.

సుమారు 12 వేల జింకలు..

కృష్ణానది పరివాహకమైన మాగనూరు, కృష్ణా, నర్వ, మరికల్‌, మక్తల్‌ మండలాల పరిధిలో ప్రధానంగా వరి, పత్తి, కంది సాగవుతోంది. సుమారు 10, 12 ఏళ్ల క్రితం ఆయా ప్రాంతాల్లో వందలలోపే ఉన్న కృష్ణ జింకల సంతతి క్రమక్రమంగా పెరిగింది. ప్రస్తుతం 10 వేల నుంచి 12 వేల వరకు కృష్ణ జింకలు ఉన్నట్లు అటవీ శాఖ అంచనా. అవి ఆహారం కోసం మూకుమ్మడిగా పంట చేలల్లోకి వస్తుండడంతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

విత్తనాలు, కాయలు, తీగలు..

కృష్ణ జింకలు పంట పొలాల్లో తిరగాడే క్రమంలో చేలల్లో మొదట్లో వేసిన విత్తనాలు మొలకెత్తడం లేదు. దీంతో నాలుగైదు పర్యాయాలు విత్తనాలు వేయడం ఆయా రైతులకు ఏటా పరిపాటిగా మారింది. ఇంతే కాకుండా.. పత్తి కాయలు, కంది కాయలను సైతం జింకలు ఆహారంగా తీసుకుంటుండడంతో పంటలు సరిగ్గా చేతికి రావడం లేదు. వరి పంటలో గుంపులు గుంపులుగా జింకలు తిరుగుతుండడంతో వేసిన గొలుసులు తెగిపోయి నష్టం వాటిల్లుతోంది. దిగుబడి తగ్గుతుండడంతో ఆ రైతులకు పెట్టుబడి కూడా రాని పరిస్థితి నెలకొంది. పంటలు కాపాడుకోవడం ఒక ఎత్తు అయితే.. ప్రతి ఏటా నష్టం వాటిల్లుతుండడంతో ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయామని రైతులు గోడు వెళ్లబోసుకుంటున్నారు.

ఎట్టకేలకు ముందడుగు..

కృష్ణ జింకల రిహాబిలిటేషన్‌ సెంటర్‌ ఏర్పాటు దిశగా ముడుమాల్‌ వద్ద 74.10 ఎకరాల భూమి హద్దులను రెవెన్యూ అధికారులు గుర్తించి మార్కింగ్‌ చేశారు. ఇటీవల ఆ భూమిని అటవీ శాఖకు అప్పగిస్తూ ఆర్డర్లు సైతం జారీ అయ్యాయి. దీంతో అటవీ శాఖ ఎట్టకేలకు రిహాబిలిటేషన్‌ సెంటర్‌ ఏర్పాటు పనుల కోసం టెండర్లు పిలిచేందుకు సిద్ధమవుతోంది. చెరువు పరిధిలోకి రాని సుమారు 44 ఎకరాల్లో శాశ్వత, చెరువు పరిధిలోకి వచ్చే 30 ఎకరాల్లో తాత్కాలికంగా పనులు చేపట్టేలా అధికారులు ముందుకు సాగుతున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికై నా ఎలాంటి జాప్యం లేకుండా చూసి.. జింకల సమస్య తీర్చాలని రైతులు వేడుకుంటున్నారు.

కృష్ణానది పరీవాహకంలో

అన్నదాతల అగచాట్లు

విజ్ఞప్తులు.. ప్రతిపాదనలు..

ఆదేశాలకే పరిమితం

రిహాబిలిటేషన్‌ సెంటర్‌

ఏర్పాటులో జాప్యం

నష్టంతోపాటు నిత్య కాపలాతో

రైతులకు తప్పని తిప్పలు

మా కుటుంబానికి దాదాపు 30 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. ప్రతిఏటా పత్తి వేస్తున్నాం. జింకల వల్ల విత్తనాలను మళ్లీ మళ్లీ నాటడం ఆనవాయితీగా మారింది. కాయలు పడుతున్నప్పుడు గుంపులుగా దాడి చేసి తింటున్నాయి. ఎన్ని ప్రయత్నాలు చేసినా.. అవి చేనులోకే వస్తున్నాయి. జింకలను పట్టి పరిరక్షణ కేంద్రాలకు తరలించాలి.

– అంపయ్య, గుడేబల్లూరు,

కృష్ణా మండలం, నారాయణపేట జిల్లా

కృష్ణాతీరంలో కృష్ణ జింకల బెడద నుంచి పంటలను కాపాడాలని రైతుల నుంచి వచ్చిన విజ్ఞప్తులపై కాంగ్రెస్‌ ప్రభుత్వం స్పందించింది. జింకలను పట్టి నల్లమల, కవ్వాల్‌ అడవులకు తరలించాలని ప్రభుత్వం ఏర్పాటైన తొలినాళ్లలోనే నిర్ణయించి.. రూ.2.70 కోట్ల నిధులు సైతం కేటాయించింది. అనంతరం కలెక్టర్‌ ఆదేశాల మేరకు అటవీ శాఖ ముందుగా రిహాబిలిటేషన్‌ సెంటర్‌ ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. కృష్ణా మండలం ముడుమాల్‌ వద్ద అందుబాటులో ఉన్న భూమిని అధికారులు పరిశీలించారు. సర్వే నం.192లోని 18.29 ఎకరాలు, సర్వే నం.194లోని 55.21 ఎకరాలు మొత్తం కలిపి 74.10 ఎకరాల్లో రిహాబిలిటేషన్‌ సెంటర్‌ ఏర్పాటుకు అడుగులు పడ్డాయి. కానీ, ఇందులో తొలుత ఎనిమిది ఎకరాలు, ఆ తర్వాత సుమారు 30 ఎకరాల్లో చెరువు ఉండడం, రెవెన్యూ శాఖ తిరకాస్తు వంటి సమస్యలతో జాప్యం జరుగుతున్నట్లు తెలుస్తోంది.

హే కృష్ణా.. ఇకనైనా! 1
1/1

హే కృష్ణా.. ఇకనైనా!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement