
అతివలకు అభయం
మహిళలకు అండగా నిలుస్తున్న సఖి కేంద్రం
● వేధింపులకు గురయ్యే వారికి
సత్వర సాయం
● ఈ ఏడాది 220 కేసులు పరిష్కారం
● జిల్లాలో వాహనం సైతం
అందుబాటులోకి..
●
సఖి కేంద్రంలో బాధిత మహిళలకు కౌన్సెలింగ్, న్యాయ, వైద్య సహాయం, తాత్కాలికంగా ఆశ్రయం కల్పించి సమస్యల పరిష్కారానికి కృషిచేస్తున్నాం. మహిళలపై హింస, లైంగిక దాడులపై క్షేత్రస్థాయిలో అవగాహన కల్పిస్తున్నాం. బాధిత మహిళలు ఒక్క ఫోన్‌కాల్ చేసినా సకాలంలో స్పందిస్తున్నాం.
– సునీత, సఖి సెంటర్ కోఆర్డినేటర్
జిల్లాకేంద్రంలోని సఖి కేంద్రం
సాక్షి, నాగర్‌కర్నూల్: జిల్లాలో మహిళలపై హింస, వేధింపుల కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. నిత్యం ఏదో ఒక చోట మహిళలు వేధన, హింసకు గురవుతున్నారు. ఈ క్రమంలో బాధిత మహిళలకు జిల్లా సఖి కేంద్రం అండగా నిలుస్తోంది. గృహహింస, పని ప్రదేశాల్లో లైంగిక వేధింపులు, వరకట్న వేధింపులు ఎదుర్కొంటున్న మహిళలకు సత్వర సహాయాన్ని అందిస్తోంది. ఈ ఏడాది ఇప్పటివరకు సఖి కేంద్రానికి 243 ఫిర్యాదులు రాగా.. ఇందులో 220 కేసులను పరిష్కరించారు.
వన్‌స్టాప్ సెంటర్‌గా ‘సఖి’ సేవలు..
గృహహింస, లైంగిక, వరకట్న వేధింపులు చోటు చేసుకున్నప్పుడు బాధిత మహిళలు సురక్షితంగా ఉండి.. సాంత్వన పొందేందుకు సఖి సెంటర్ కీలకంగా పనిచేస్తోంది. వన్ స్టాప్ సర్వీస్ (ఓఎస్‌సీ)గా ఏర్పాటై 24 గంటల పాటు పనిచేసే సఖి కేంద్రంలో బాధిత మహిళలకు అవసరమైన సత్వర సహాయాన్ని అందిస్తున్నారు. బాధితులకు కౌన్సె లింగ్, వైద్య సహాయం, న్యాయ సలహాలు అందించడంతో పాటు తాత్కాలిక వసతి కల్పిస్తున్నారు. గాయపడిన మహిళలకు సత్వర చికిత్స అందించడం, మెడికో లీగల్ సర్టిఫికెట్ పొందడం, పోలీస్, న్యాయ సహాయాన్ని పొందడంలో సహాయం చేస్తున్నారు. ఇటీవల జిల్లాలో మొబైల్ వ్యాన్ సైతం అందుబాటులోకి రావడంతో సఖి కేంద్రం సభ్యులు బాధితుల వద్దకే వెళ్లి వివరాలు సేకరిస్తున్నారు. రక్షణ అవసరమైన వారిని ప్రత్యేక వాహనంలో సఖి కేంద్రానికి తరలిస్తున్నారు.
గృహహింస
కేసులు: 157
లైంగిక
వేధింపులు: 2
మిస్సింగ్: 26
పరిష్కరించినవి:
220

అతివలకు అభయం