ప్రజాపాలన దినోత్సవానికి ముఖ్యఅతిథిగా చిన్నారెడ్డి | - | Sakshi
Sakshi News home page

ప్రజాపాలన దినోత్సవానికి ముఖ్యఅతిథిగా చిన్నారెడ్డి

Sep 16 2025 7:23 AM | Updated on Sep 16 2025 7:23 AM

ప్రజా

ప్రజాపాలన దినోత్సవానికి ముఖ్యఅతిథిగా చిన్నారెడ్డి

నాగర్‌కర్నూల్‌ క్రైం: జిల్లా కేంద్రంలోని పోలీసు పరేడ్‌ మైదానంలో ఈ నెల 17న నిర్వహించనున్న తెలంగాణ ప్రజాపాలన దినోత్సవానికి ముఖ్య అఽతిథిగా రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు జి.చిన్నారెడ్డి హాజరు కానున్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు. తెలంగాణ ప్రజాపాలన దినోత్సవంలో చిన్నారెడ్డి జాతీయ జెండాను ఎగురవేసి ప్రసంగించనున్నారు.

ఘనంగా ఇంజినీర్స్‌ డే

దోమలపెంట: భారతరత్న మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతిని పురస్కరించుకొని సోమవారం శ్రీశైలం భూగర్భ జలవిద్యుత్‌ ఉత్పత్తి కేంద్రంలో జాతీయ ఇంజినీర్ల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేంద్రం సీఈ కేవీవీ సత్యనారాయణ, ఎస్‌ఈలు రవీంద్రకుమార్‌, ఆదినారాయణ, డీఈలు, ఏడీఈలు, ఏఈలు విశ్వేశ్వరయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో పవర్‌ ఇంజినీర్స్‌ అసోసియేషన్‌ కార్యదర్శి బి.మదన్మోహన్‌రెడ్డి (ఏడీఈ), చంద్రశేఖర్‌ (డీఈ), ఏఈల అసో సియేషన్‌ కార్యదర్శులు వై.నరేశ్‌, నరేంద్రకుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

పథకాలను సద్వినియోగం చేసుకోవాలి

వెల్దండ: ప్రభుత్వ పథకాలను అర్హులందరూ సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర ఫుడ్‌ కమిషన్‌ చైర్మన్‌ గోలి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. సోమవారం వెల్దండలో పలువురికి సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రోడ్డు ప్రమాదాలు, అనారోగ్యం ఇతరత్రా కారణాలతో ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్స చేయించుకునే పేదలకు ప్రభుత్వం సీఎం సహాయనిధి అందించి అండగా నిలుస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో సింగిల్‌విండో డైరెక్టర్లు శేఖర్‌, నాగులునాయక్‌, మాజీ ఉపసర్పంచ్‌ నిరంజన్‌, బీఆర్‌ఎస్‌ నాయకులు నిరంజన్‌, నర్సింహ, మధుసూదన్‌రెడ్డి, జోగయ్య, శ్రీనివాసులు పాల్గొన్నారు.

‘నక్కలగండి’ ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీ పెంచాల్సిందే..

అచ్చంపేట రూరల్‌: నక్కలగండి ప్రాజెక్టులో సర్వం కోల్పోతున్న తమకు ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీ పెంచడంతో పాటు ప్రతి కుటుంబానికి ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీ వర్తింపజేయాలని నిర్వాసితులు డిమాండ్‌ చేశారు. అచ్చంపేట మండలం మార్లపాడుతండా, కేశ్యాతండాల్లో సోమవారం అదనపు కలెక్టర్‌ అమరేందర్‌ ఆధ్వర్యంలో గ్రామసభలు నిర్వహించగా.. ముంపు బాధితులు తమ సమస్యలను వెలిబుచ్చారు. ఇంటి ఖాళీ స్థలాలకు గజం రూ. 3వేల చొప్పున చెల్లించడంతో పాటు ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీ కింద ఇంటికో ఉద్యోగం, మూడెకరాల భూమి, పట్టణాల సమీపంలో ఇంటి స్థలాలు ఇవ్వాలన్నారు. అదే విధంగా ప్రాజెక్టును పర్యాటకంగా అభివృద్ధిపరిచి ముంపు బాధిత కుటుంబాలకు ఉపాధి అవకాశాలు కల్పించాలని కోరారు. అనంతరం అదనపు కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. సమావేశంలో ఆర్డీ ఓ మాధవి, తహసీల్దార్‌ సైదులు, ఆర్‌ఐ బాల్‌రాం, నాయకులు భాస్కర్‌, రవి ఉన్నారు.

కేఎల్‌ఐ కాల్వ నిర్మాణానికి సహకరించాలి

వెల్దండ: కేఎల్‌ఐ సబ్‌ కెనాల్‌ నిర్మాణానికి రైతులు సహకరించాలని భూసేకరణ స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌ కార్తీక్‌రావు, ఇరిగేషన్‌శాఖ అధికారి వెంకట్‌రెడ్డి కోరారు. సోమవారం మండలంలోని అజిలాపూర్‌ గ్రామపంచాయతీ కార్యాలయంలో కేఎల్‌ఐ సబ్‌ కెనాల్‌ నిర్మాణంపై రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కేఎల్‌ఐ డీ–8 కాల్వ ద్వారా మాడ్గుల మండలం పోలేపల్లి మీదుగా నాగిళ్ల వరకు మాత్రమే సాగునీరు అందుతుందన్నారు. సబ్‌ కెనాల్‌ నిర్మాణంతో మాడ్గుల మండలంలోని చంద్రాయన్‌పల్లి, కలకొండ, వెల్దండ మండలం అంకమోనికుంట, అజిలాపూర్‌ గ్రామ రైతులకు సాగునీరు అందుతుందని వివరించారు. అజిలాపూర్‌కు చెందిన 30మంది రైతుల పొలాల్లో సబ్‌ కెనాల్‌ నిర్మాణం జరుగుతుందని.. రైతులకు ప్రభుత్వ నష్టపరిహారం చెల్లిస్తుందని తెలిపారు. కాల్వ నిర్మాణానికి అందరూ సహకరించాలని కోరారు.

ప్రజాపాలన దినోత్సవానికి ముఖ్యఅతిథిగా చిన్నారెడ్డి  
1
1/2

ప్రజాపాలన దినోత్సవానికి ముఖ్యఅతిథిగా చిన్నారెడ్డి

ప్రజాపాలన దినోత్సవానికి ముఖ్యఅతిథిగా చిన్నారెడ్డి  
2
2/2

ప్రజాపాలన దినోత్సవానికి ముఖ్యఅతిథిగా చిన్నారెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement