
యూరియా కోసం రైతుల బారులు
పెద్దకొత్తపల్లి: రైతులకు యూరియా కష్టాలు తీరడం లేదు. రెండు బస్తాల యూరియా కోసం గంటల తరబడి పడిగాపులు కాస్తున్నారు. సోమవారం పెద్దకొత్తపల్లి సింగిల్‌విండో కార్యాలయం వద్ద రైతులు తెల్లవారుజాము నుంచే క్యూ కట్టారు. వివిధ గ్రామాల నుంచి దాదాపు 600 మంది రైతులు యూరియా కోసం రాగా.. కేవలం 120 మందికి మాత్రమే రెండు బస్తాల చొప్పున యూరియా లభించింది. మిగతా రైతులు నిరాశతో వెనుదిరిగారు. వారానికి ఒక లారీ చొప్పున యూరియాను సరఫరా చేస్తుండటంతోనే రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం వరిపంట పొట్ట దశలో ఉండటం.. యూరియా సకాలంలో లభించకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. వానాకాలం పంటలకు సరిపడా యూరి యా అందించాలని కోరుతున్నారు.