
మహిళా ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి
● రేపటి నుంచి అక్టోబర్ 2 వరకు వైద్యశిబిరాలు
● మహిళలు సద్వినియోగం చేసుకోవాలి
● కలెక్టర్ బదావత్ సంతోష్
నాగర్‌కర్నూల్: మహిళా ఆరోగ్యంతోనే శక్తివంతమైన కుటుంబం సాధ్యమవుతుందని కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన వివిధ శాఖల సమన్వయ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆరోగ్య మహిళా.. శక్తివంతమైన కుటుంబం కార్యక్రమంలో భాగంగా ఈ నెల 17నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు జిల్లాలోని అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్య నిపుణులచే ప్రత్యేకంగా వైద్యశిబిరాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. శిబిరాల్లో రక్త పరీక్షలతో పాటు నోటి క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ స్క్రీనింగ్, రక్తహీనత, క్షయవ్యాధి, సికిల్ సెల్ అనీమియా తదితర అన్నిరకాల పరీక్షలు నిర్వహిస్తారన్నారు. ఈ అవకాశాన్ని జిల్లాలోని మహిళలు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ సూచించారు. మహిళా శిశు సంక్షేమశాఖ, డీఆర్డీఓ, విద్యాశాఖ, ట్రైబల్, బీసీ, ఎస్సీ వెల్ఫేర్ సంక్షేమ శాఖల సహకారంతో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.
● ప్రజావాణికి వచ్చిన ఫిర్యాదులను పెండింగ్‌లో ఉంచకుండా త్వరగా పరిష్కరించాలని కలెక్టర్ సంతోష్ సంబంధిత అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో అదనపు కలెక్టర్ దేవ సహాయంతో కలిసి ఆయన ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. వివిధ సమస్యలపై 91 అర్జీలు అందాయని.. అధికారులు క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కరించాలని కలెక్టర్ సూచించారు.
● జిల్లాలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్‌ఐఆర్)–2026 ప్రక్రియను పకడ్బందీగా చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నామని కలెక్టర్ అన్నారు. సోమవారం రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ఎస్‌ఐఆర్ ప్రక్రియపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించగా.. జిల్లా నుంచి కలెక్టర్‌తో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు.
ఇందిరమ్మ ఇళ్ల పనుల్లో వేగం పెంచండి..
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను వేగవంతంగా పూర్తిచేయాలని కలెక్టర్ సూచించారు. నాగర్‌కర్నూల్ మండలం తూడుకుర్తిలో ఆయన పర్యటించి ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను పరిశీలించారు. ఇళ్ల పనుల పురోగతిని ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని అధికారులకు సూచించారు. అనంతరం పల్లె దవాఖానాను కలెక్టర్ ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ప్రజలకు అందిస్తున్న వైద్యసేవలను తెలుసుకున్నారు. దవాఖానాలో అందుబాటులో ఉన్న ఔషధాలు, వాటి కాలపరిమితిని పరిశీలించారు. అదే విధంగా అంగన్‌వాడీ కేంద్రాన్ని కలెక్టర్ తనిఖీ చేశారు. కేంద్రంలో చిన్నారుల ఆరోగ్యం, విద్య, పోషకాహార పదార్థాల నాణ్యతను పరిశీలించారు.