‘పాలమూరు’ను జిల్లా బిడ్డే ఎండబెడుతున్నారు.. | - | Sakshi
Sakshi News home page

‘పాలమూరు’ను జిల్లా బిడ్డే ఎండబెడుతున్నారు..

Sep 10 2025 9:59 AM | Updated on Sep 10 2025 9:59 AM

‘పాలమూరు’ను జిల్లా బిడ్డే ఎండబెడుతున్నారు..

‘పాలమూరు’ను జిల్లా బిడ్డే ఎండబెడుతున్నారు..

సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్‌: సీఎం రేవంత్‌రెడ్డి 21 నెలల పాలనలో ఎక్కడ మాట్లాడినా.. నేను పాలమూరు బిడ్డను, నల్లమల బిడ్డను అని చెప్పుకుంటారని.. కానీ ఆయనే పాలమూరును ఎండబెడుతున్నారని భారత రాష్ట్ర సమితి వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు అన్నారు. మాజీ మంత్రి సి.లక్ష్మారెడ్డి భార్య శ్వేతారెడ్డి ప్రథమ వర్ధంతి సందర్భంగా మంగళవారం ఆయన మాజీ మంత్రి హరీశ్‌రావుతో కలిసి నాగర్‌కర్నూల్‌ జిల్లా తిమ్మాజీపేట మండలంలోని ఆవంచ గ్రామానికి వచ్చారు. శ్వేతారెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించి నివాళులర్పించారు. ఆ తర్వాత వారు మహబూబ్‌నగర్‌ జిల్లా జడ్చర్లలోని లక్ష్మారెడ్డి ఇంట్లో భోజనం చేశారు. హరీశ్‌రావు తిరిగి హైదరాబాద్‌కు పయనమైన అనంతరం కేటీఆర్‌ విలేకరుల సమావేశంలో మాట్లాడారు. పాలమూరు వెనుకబాటుతనానికి టీడీపీ, కాంగ్రెస్‌ కారణమని ఆయన టీడీపీలో ఉన్నప్పుడే చెప్పారన్నారు. పాలమూరు బిడ్డ ముఖ్యమంత్రి అయితే తమ బతుకులు మారుతాయని.. ఆరు గ్యారంటీలు 100 రోజుల్లో అమలవుతాయనే ఆశతో ఇక్కడి ప్రజలు 12 అసెంబ్లీ స్థానాల్లో కాంగ్రెస్‌ అభ్యర్థులను గెలిపించారన్నారు.

21 నెలలుగా పడావు పెట్టారు..

బీఆర్‌ఎస్‌ హయాంలో పాలమూరులో వివిధ ప్రాజెక్ట్‌లను పూర్తి చేసి 8 లక్షల ఎకరాలకు నీళ్లు పారించినట్లు కేటీఆర్‌ వెల్లడించారు. పాలమూరును కోనసీమగా మార్చాలనే లక్ష్యంతో కేసీఆర్‌ నాయకత్వంలో పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్ట్‌ను 90 శాతం పూర్తి చేశామని.. కానీ పాలమూరుకు చెందిన సీఎం 21 నెలలు గడిచినా పనులు పూర్తిచేయడం లేదన్నారు. మిగతా పది శాతం పనులు పూర్తి చేసి.. నీళ్లు పారిస్తే కేసీఆర్‌కు పేరు వస్తుందనే భయంతో పాలమూరును పడావు పెట్టారని మండిపడ్డారు. పైసా పని చేయకుండా అదే పాలమూరు ప్రాజెక్ట్‌కు వారి మామ జైపాల్‌రెడ్డి పేరు పెట్టుకోవడంపై ప్రజలే ఆలోచన చేయాలన్నారు.

దురాలోచనతో కొడంగల్‌కు శ్రీకారం..

పాలమూరు ఎత్తిపోతల్లో భాగంగా ఉమ్మడి పాలమూరు, కొడంగల్‌ నియోజకవర్గంతో పాటు రంగారెడ్డి జిల్లాకు ప్రయోజనం చేకూరేలా ప్లాన్‌ చేసి.. ప్రాజెక్ట్‌ను 90 శాతం పూర్తి చేశామని తెలిపారు. అయితే హడావుడిగా కొడంగల్‌, రంగారెడ్డికి నీరందించే సోర్స్‌ను శ్రీశైలం నుంచి జూరాలకు మార్చి రూ.4 వేల కోట్లతో సీఎం రేవంత్‌రెడ్డి టెండర్లు పూర్తి చేశారన్నారు. మనసులో ఏదో దురాలోచనతో పర్యావరణ అనుమతుల్లేకుండా టెండర్లు పూర్తి చేయడంతో రైతులు ఎన్జీటీని ఆశ్రయించగా.. స్టే ఇచ్చిందన్నారు. కొడంగల్‌ ఎత్తిపోతల కింద రైతులు కూడా పరిహారం కోసం రోడ్డెక్కుతున్నారన్నారు.

చౌకబారు రాజకీయాలు చేస్తున్నారు..

బీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలను కాంగ్రెస్‌ వాళ్లు వేధింపులకు గురి చేస్తున్నారని కేటీఆర్‌ మండిపడ్డారు. దేవరకద్రలో మండల పార్టీ అధ్యక్షుడిపై లేని కేసు పెట్టి జైలుకు పంపించారని.. కాంగ్రెస్‌లో చేరితే కేసు తీసేస్తామంటూ బెదిరిస్తున్నారని తెలిపారు. చిన్నచిన్న వ్యాపారాలు చేసుకునే వారు, క్రషర్‌ నిర్వాహకులపై జీఎస్టీ, పోలీసులతో బెదిరింపులకు పాల్పడుతున్నారని పార్టీ నాయకులు తమ దృష్టికి తీసుకొచ్చినట్లు వెల్లడించారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలను చైతన్యవంతం చేసేలా ఆలోచన చేసి ముందుకు సాగుతామన్నారు. ఎమ్మెల్సీ నవీన్‌కుమార్‌రెడ్డి, ఎమ్మెల్యే విజయుడు, మాజీ మంత్రులు నిరంజన్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్‌, మాజీ ఎమ్మెల్యేలు మర్రిజనార్దన్‌రెడ్డి, పట్నం నరేందర్‌రెడ్డి, ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, రాజేందర్‌రెడ్డి, రావుల చంద్రశేఖర్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

చెప్పుకోలేనిదురావస్థలో ఉన్నారు..

గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి బీఆర్‌ఎస్‌లోనే ఉన్నానని చెబుతున్నారు కదా అంటూ పార్టీ ఫిరాయింపులకు సంబంధించి విలేకరులు అడిగిన ప్రశ్నకు కేటీఆర్‌ సమాధానమిచ్చారు. ‘కృష్ణమోహన్‌రెడ్డి సమక్షంలోనే కేసీఆర్‌పై మంత్రులు పొంగులేటి, జూపల్లి ఆరోపణలు, విమర్శలు చేస్తుంటే ఆయన ఎందుకు మౌనం వహించారు.. కాంగ్రెస్‌లో చేరిన కొందరు ఎమ్మెల్యేలు ఏ పార్టీలో ఉన్నామో చెప్పుకోలేని దురావస్థలో ఉన్నారు’ అని విమర్శించారు.

బీఆర్‌ఎస్‌ హయాంలో 90 శాతం పనులు పూర్తి

మిగిలిన 10 శాతం పనులు ఎందుకు పూర్తి చేయడం లేదు

కేసీఆర్‌కు పేరు వస్తుందనే పడావు పెట్టారు

సీఎం రేవంత్‌పై బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ధ్వజం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement