
యూరియా పక్కదారి పడితే చర్యలు
నాగర్‌కర్నూల్/పెద్దకొత్తపల్లి: జిల్లాలో యూరియా పంపిణీ పారదర్శకంగా జరిగేలా చర్యలు చేపట్టాలని వ్యవసాయ అధికారులకు కలెక్టర్ బదావత్ సంతోష్ ఆదేశాలు జారీ చేశారు. మంగళవారం కలెక్టరేట్‌లో జిల్లావ్యాప్తంగా యూరియా లభ్యత, డిమాండ్, సరఫరాపై కలెక్టర్ సమీక్షించారు. ప్రభుత్వ, ప్రైవేట్ ఎరువుల దుకాణాల వద్ద అధికారులు నిఘా పెంచి, యూరియా పక్కదారి పట్టకుండా చర్యలు చేపట్టాలని, రైతులకు యూరియా సమయానికి అందేలా చూడాలన్నారు. జిల్లాలో 5.38 లక్షల ఎకరాల్లో పంట సాగైందని, 40 వేల మెట్రిక్ టన్నుల యూరియా అవసరం కాగా.. ఇప్పటివరకు 19,859 మెట్రిక్ టన్నులు అందాయని, ఇంకా 15,885 మెట్రిక్ టన్నుల యూరియా రావాల్సి ఉందని చెప్పారు. జిల్లాలో నానో యూరియా వినియోగంపై అవగాహన పెంచాలని, ఇప్పటివరకు రైతులకు 12 వేల లీటర్ల నానో యూరియాను అందించినట్లు కలెక్టర్ వివరించారు. అనంతరం పెద్దకొత్తపల్లి మండలంలోని కొత్తపేట ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాన్ని వ్యవసాయ అధికారులతో కలిసి కలెక్టర్ తనిఖీ చేశారు.
రైతులకు నష్టం కలగకుండా..
పంట సాగులో ఎలాంటి నష్టం జరుగకుండా ఉండేందుకే విత్తన, ఎరువుల డీలర్లకు శిక్షణ ఇస్తున్నట్లు కలెక్టర్ బదావత్ సంతోష్ తెలిపారు. మంగళవారం ఐడీఓసీ సమావేశ మందిరంలో జిల్లాలో వ్యవసాయ సంబంధిత ఇన్‌ఫుట్ వ్యాపారాలు నిర్వహించే డీలర్లకు శిక్షణ, విద్య ప్రాముఖ్యత గురించి వివరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎరువులు, విత్తనాలు, పురుగు మందులు వంటి వ్యవసాయ ఉత్పత్తులను విక్రయించే వ్యాపారులు డీఏఈఎస్‌ఐ (డిప్లొమా ఇన్ అగ్రికల్చర్ ఎక్స్‌టెన్షన్ సర్వీసెస్ ఫర్ ఇన్‌పుట్ డీలర్స్) అనే డిప్లొమా కోర్సును తప్పనిసరిగా పూర్తి చేయాలని స్పష్టం చేశారు. శిక్షణలో డీలర్లు రైతులకు సరైన మార్గదర్శకత్వం అందించగలిగే స్థాయిలో అవగాహన, సాంకేతిక పరిజ్ఞానం పొందుతారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా 4, 5వ బ్యాచ్‌లకు చెందిన 75 మంది డీలర్లకు డిప్లొమా సర్టిఫికెట్లు అందజేశారు. ఇప్పటి వరకు 200 మంది డీలర్లు ఈ శిక్షణను విజయవంతంగా పూర్తిచేసుకున్నట్లు వెల్లడించారు. సమావేశంలో జిల్లా వ్యవసాయ అధికారి యశ్వంత్‌రావు, డివిజన్ వ్యవసాయ అధికారులు చంద్రశేఖర్, పూర్ణచంద్రారెడ్డి, కార్యాలయ వ్యవసాయ అధికారి శివ, కేవీకే పాలెం కోఆర్డినేటర్ శ్రీదేవి, కేడీఆర్ పాలెం ప్రసాద్, జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి జ్ఞానశేఖర్, పెద్దకొత్తపల్లి ఏఓ శిరీష, ఏఈఓలు వినోద్, జానకీరాం, సింగిల్‌విండో కార్యదర్శి వెంకటస్వామిగౌడు తదితరులు పాల్గొన్నారు.
మైనార్టీ గురుకుల పాఠశాల తనిఖీ
కొల్లాపూర్: పట్టణంలోని మైనార్టీ గురకుల పాఠశాలను మంగళవారం మధ్యాహ్నం కలెక్టర్ బదావత్ సంతోష్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులకు వడ్డిస్తున్న భోజనం, వంటగదిని పరిశీలించారు. వంట సామగ్రి, స్టాక్ నిల్వకు సంబంధించిన రికార్డులను చూశారు. అనంతరం విద్యార్థులతో కలిసి సహాపంక్తి భోజనాలు చేశారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్ నిరూప, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.